బలవంతపు భూసేకరణ ఆపాలి
హిందూపురం: బలవంతపు భూసేకరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు, గ్రామస్తులతో కలసి మంగళవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రామ్‌కుమార్, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలో పారిశ్రామిక అవసరాల కోసమని చంద్రబాబు ప్రభుత్వం మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, బాలంపల్లి, చెర్లోపల్లి, కొండూరు, లేపాక్షి ప్రాంతాలలో బలవంతపు భూసేకరణ చేపట్టిందని మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో రైతుల అనుమతి లేకుండానే భూసేకరణకు సిద్ధం కావడం ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. పచ్చటి పొలాలను బీడు చేసి పరిశ్రమలు తేస్తామంటే కుదరదన్నారు. భూసేకరణ చేసే గ్రామాలలో ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. అలా కాకుండా భూసేకరణ చేయాలనుకుంటే జీఓ 259 ప్రకారం మార్కెట్ ధరకు నాలుగింతల పరిహారంతో పాటు మొత్తానికి వంద శాతం సొలీషియం కలిపి చెల్లించాలన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాలలో ఎకరం రూ.25 లక్షల ధర ఉంటే దానికి రెండింతలు రూ.50 లక్షల అవుతుందని, సొలేషియంతో మరో రూ.50 లక్షలు కలిపి మొత్తం ఎకరాకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, నాయకులు ప్రసాద్, రమణ, సురేష్, రైతు సంఘం నాయకులు చలపతి, తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం నాయకుడు రవి, ఓపీడీఆర్ నాయకుడు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
కరపత్రాలు విడుదల చేసిన
రైతు సంఘం నాయకులు


