పాములంటే ప్రాణం
‘కన్నా ఆగరా’... అంటూ ప్రేమగా వాటి వెనుక పరిగెడుతుంటాడు అతను. అలాగని కుక్కో, పిల్లో అనుకోవద్దు. భయంతో పారిపోతున్న పాములవి. వాటిని అలాగే చేతులతో పట్టుకుంటాడు. వాటిని ముద్దుగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తుంటాడు. ఇంతకు విష సర్పాలంటే అంత మక్కువ ఎవరికుంటుందని అనుకుంటున్నారా? అయితే కదిరిలోని ఖాజీపీర్ గురించి తెలుసుకోవాల్సిందే.
కదిరి అర్బన్: అతని వృత్తి కొబ్బరి బొండాల వ్యాపారం. ప్రవృత్తి పాముల రక్షణ. కదిరి ప్రాంతంలో ఎక్కడైనా పాము కనిపిస్తే వెంటనే గుర్తుకు వచ్చేది ఖాజా పీర్. సాధారణంగా పాము కనిపిస్తే వెంటనే భయంతో చంపేయడానికే చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే ఈ ప్రపంచంలో మానవులతో పాటు సకల జీవరాశులకు జీవించే హక్కు ఉందని, ఇందులో పాములు కూడా ఒక్కటంటూ ప్రజలను చైతన్య పరుస్తూ వాటి రక్షణకు ఖాజాపీర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రమాదమని తెలిసినా విష సర్పాలను పట్టే కార్యక్రమం మాత్రం అతను ఆపలేదు. పాముల గురించి ఎలాంటి భయం లేదని, వాటికి హానీ తలపెట్టనంతవరకూ అవి ఎవరినీ కాటేయవని ఖాజాపీర్ చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో పాములు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు. ఇళ్లలో, ఇంటి పరిసరాలతో పాటు పొలాల్లో పాములు కనిపించిన వెంటనే సమాచారం అందుకున్న ఖాజాపీర్ ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని వాటిని బంధించి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేస్తుంటారు.
సర్పాల రక్షణకు ప్రత్యేక చొరవ


