ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో హోంగార్డు భార్య
ఉన్నతాధికారుల నుంచి టీడీపీ నేతల ఒత్తిళ్లు
ససేమిరా అనడంతో హోంగార్డు బదిలీ
కర్నూలు జిల్లా: ‘‘నీ భార్యను రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పుకో, లేదా నిన్ను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తామని పోలీసు అధికారులు హోంగార్డును బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరు పోలీసు సర్కిల్ కార్యాలయంలో వాసు హోంగార్డు(నంబర్ 789)గా పని చేస్తున్నాడు. పట్టణ కేంద్రమైన ఆలూరులో 5వ వార్డు అన్ రిజర్వుడ్ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ తరపున హోంగార్డు వాసు భార్య వడ్డె శ్రావణి పోటీ చేస్తున్నారు.
అయితే ఆమె గెలుపును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు ఒడిగట్టారు. ‘‘నీ భార్యకు రాజకీయాలు ఎందుకు, తప్పుకోవాలని చెప్పు, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటావు’’ అంటూ పోలీసు అధికారులతో చెప్పించి చూశారు. అయితే ఆమెకు మీరే చెప్పి విత్‌డ్రా చేయించాలని హోంగార్డు అధికారులతో అనడంతో అధికారులే నేరుగా శ్రావణికి ఫోన్ చేసి ‘‘నీకెందుకమ్మ రాజకీయాలు, విత్‌డ్రా చేసుకో’ అంటూ చెప్పారు.
అయితే శ్రావణి ‘నా భర్త ఉద్యోగం వేరు, నా రాజకీయం వేరు’ అని తేల్చిచెప్పడంతో సదరు అధికారి విషయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే హోంగార్డును ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు రావడంతో ఇదేం రాజకీయమని స్థానికులు మండిపడుతున్నారు.


