సీఎం విజయ్‌, త్రిషపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు | Police file case against DMK MLA Anitha Radhakrishnan over remarks against CM Vijay | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌, త్రిషపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Jun 25 2026 6:29 PM | Updated on Jun 25 2026 6:58 PM

Police file case against DMK MLA Anitha Radhakrishnan over remarks against CM Vijay

సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. సీఎం విజయ్‌,హీరోయిన్‌ త్రిషను ఉద్దేశిస్తూ డీఎంకే నేత,ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనితా రాధాకృష్ణన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నెల జూన్ 20న తమిళనాడు తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక సంక్షేమ కార్యక్రమ వేదికగా.. సీఎం విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావడం, విజయ్‌-త్రిషల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం, అసెంబ్లీలో విజయ్‌ వ్యవహరిస్తున్న శైలిని ఎగతాళి చేస్తూ అనితా రాధాకృష్ణన్ మాట్లాడటంతో ఈ వివాదం మొదలైంది.

నటి ఇంట్లో సంతోషంగా గడిపే ముఖ్యమంత్రి విజయ్‌.. ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయి, నలువైపులా ఇరుక్కుపోయానే అనే మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్‌ల కంటే రాజకీయం, రాష్ట్ర పాలన ఎంతో భిన్నమైనవని సూచించారు. 

తాను ఒక వ్యాపారవేత్తనని పేర్కొంటూ, తన దుకాణంలోకి ఒక కస్టమర్ అప్పు కోసం వచ్చాడా లేదా నగదుతో వస్తువులు కొనడానికి వచ్చాడా అనేది వారి ముఖం చూసి చెప్పగలనని అనితా రాధాకృష్ణన్ ఈ సందర్భంగా ఉదాహరించారు. అదేవిధంగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే, ‘ఓరి దేవుడా.. నన్ను ఎంతటి పెద్ద ఉచ్చులో బిగించేశారు’ అని ఆయన లోలోపల సహాయం కోసం అర్థించేలా ఉన్నట్లు తనకు అనిపించిందని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.  

అసెంబ్లీలో ముఖ్యమంత్రి హావభావాలను తప్పుబడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణన్‌ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టీవీకే నేతల ఫిర్యాదుతో స్పందించిన ఆత్తూరు పోలీసులు అనితా రాధాకృష్ణన్‌పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ జూన్ 20న చేసిన రాజకీయ విమర్శలు, నటి త్రిష జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫోటో వల్ల వైరల్ కావడంతో వివాదానికి దారితీశాయి. జూన్ 24-25 తేదీల్లో టీవీకే శ్రేణులు ఈ పాత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement