టీడీపీ అభ్యర్థుల ఊసేలేదు | Pawan Kalyan Ignored TDP candidates At Varahi Yatra Anakapalle | Sakshi
Sakshi News home page

టీడీపీ అభ్యర్థుల ఊసేలేదు

Published Mon, Apr 8 2024 1:44 PM | Last Updated on Mon, Apr 8 2024 3:24 PM

Pawan Kalyan Ignored TDP candidates At Varahi Yatra Anakapalle - Sakshi

వారాహి యాత్రలో కనిపించని సైకిల్‌ గుర్తు

బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌, జనసేన అభ్యర్థి కొణతాలను గెలిపించాలని కోరిన పవన్‌ కల్యాణ్‌

యలమంచిలి అభ్యర్థి సుందరపు పేరూ ప్రస్తావించని జనసేన అధినేత

నిరుత్సాహాన్ని మిగిల్చిన ప్రసంగం

 తప్పులు, తడబాటుతో స్పీచ్‌

సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహియాత్రలో టీడీపీ అభ్యర్థుల ప్రస్తావన లేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్‌ గందరగోళానికి గురైంది. అనకాపల్లిలో ఆదివారం రెండు గంటల పాటు సాగిన వారాహియాత్రలో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని మాత్రమే కోరారు. కేవలం ఆ రెండు పార్టీల గుర్తులను మాత్రమే ప్రదర్శించారు. ఎక్కడా టీడీపీ అభ్యర్థుల గురించి మాట్లాడాలేదు. జిల్లాలో అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ టికెట్‌లను జనసేన అభ్య ర్థులకు కేటాయించారు.

అయితే పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌, జనసేన అనకాపల్లి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్‌బాబులను గెలిపించాలని కోరారు. యలమంచిలి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ పేరును ప్రస్తావించలేదు. ఎక్కడో ఉన్న తెనాలి నియోజకవర్గం అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, ఇటీవలే రెండు రోజుల క్రితమే జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌ను సీనియర్‌, బలమైన నాయకులకు జనసేన నుంచి పోటీకి దించాం. వారిని గెలిపించాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. విజయ్‌కుమార్‌ పేరును ప్రస్తావించకపోవడంతో అను మానాలు ఏర్పడ్డాయి.

సమస్యలపై అవగాహన లేమి
అనకాపల్లిలో సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతారేమోనని అందరూ భావించారు. ఆయన ప్రసంగం మొత్తం విన్న అనకాపల్లి ప్రజలంతా పవన్‌ కల్యాణ్‌కు ఇక్కడ సమస్యలపై అవగాహన లేదని గ్రహించారు. బహిరంగ సభలో స్క్రిప్ట్‌ కూడా సరిగ్గా చదవలేకపోయారు. ఒక సమస్య గురించి మొదలు పెట్టడం. తప్పుగా పలకడం..నాలుక తిరగకపోవడంతో మరో అంశం మాట్లాడడంతో అయోమయానికి గురిచేసింది. పవన్‌ కల్యాణ్‌ గంటపాటు చేసిన ప్రసంగంలో 50 పైగా తప్పులు మాట్లాడారు.

తడబాటు..
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని కాస్తా..సృజనా స్రవంతి అని..ఉద్యోగుల విరమణ సమయంలో ఇచ్చే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను..కంట్రీబ్యుట్‌ పెన్షన్‌ స్కీమ్‌ అని ..కశింకోట మండలంలో విసన్నపేట భూములు అనబోయి.. విసన్నపేట మండలం కశింకోట భూములు అని.. తుమ్మపాల సుగర్స్‌ను తువ్వపాల అని.. బినామీని బినామా అని పలికారు. ప్రారంభం నుంచి చివరి వరకూ ఆయన ప్రసంగం తడబాటుగానే సాగింది.

ఆలస్యంగా యాత్ర..
సాయంత్రం 4.02 నిమిషాలకు అనకాపల్లికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ 6 గంటల వరకూ హెలిప్యాడ్‌ వద్ద వారాహి వాహనంలో ఉండిపోయారు. ఆరు గంటలకు ప్రారంభం కావాల్సిన బహిరంగ సభ ఏడు గంటలకు మొదలైంది. పవన్‌కల్యాణ్‌ యాత్ర సందర్భంగా అనకాపల్లి టౌన్‌లోగల నెహ్రూచౌక్‌ జంక్షన్‌ నుంచి ట్రాఫిక్‌ నిలిపివేయడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. అడుగుడుగా కోడ్‌ ఉల్లంఘిస్తూ జనసేన కార్యకర్తలు, నాయకులు రోడ్ల పక్కనే మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

యలమంచిలి హుళక్కేనా..!
అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించారు. అనకాపల్లి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ, పెందుర్తి అభ్యర్థిగా పంచకర్ల రమేష్‌బాబు, యలమంచిలి అభ్యర్థిగా సుందరపు విజయ్‌కుమార్‌లను ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ యలమంచిలి నియోజకవర్గ అభ్యర్థి సుందరపు విజయకుమార్‌ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్ర షెడ్యూల్‌లో ఈ నెల 7న యలమంచిలిలో బహిరంగ సభ, 8న అనకాపల్లిలో బహిరంగ సభ అని ప్రకటించారు.

కానీ యలమంచిలిలో వారాహియాత్ర రద్దు చేసి..7వ తేదీన అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. దానికి తోడుగా అనకాపల్లి సభలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారాహి వాహనం మీద కూడా ఎక్కడా సుందరపు విజయ్‌కుమార్‌ కనిపించ లేదు. పవన్‌ కల్యాణ్‌ విశాఖకు వచ్చారంటే సుందరపు విజయకుమార్‌ రాకుండా ఉండరు. అలాంటిది అనకాపల్లి వారాహియాత్ర సభలో సుందరపు ఎక్కడా కనిపించ లేదు.

కొణతాల టీం అజమాయిషీతో తమ్ముళ్ల ఆవేదన
పవన్‌ సభకు అయ్యే ఖర్చంతా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ భరించారు. అనకాపల్లి పరిసరాల నుంచి జనాన్ని తరలించే బాధ్యత కొణతాలకు అప్పగించారు. కాగా కొణతాల రామకృష్ణ టీడీపీ క్యాడర్‌ను కాదని గతంలో ఉన్న తన పాత అనుచర వర్గాన్ని రంగంలోకి దించారు. ప్రతి గ్రామంలోను కొణతాలకు ఒకరిద్దరు అనుచరులు ఉన్నారు. గ్రామాల్లో డబ్బు పంచే బాధ్యత వారికే అప్పగించారు. వారు శనివారం రాత్రి గ్రామాల్లో టీడీపీ నేతలకు నగదు అందజేసి, జనాన్ని తరలించాలని ఆదేశించారు. ఇది తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో టీడీపీ నేతలు కొణతాల అనుచరులపై తిరుగుబాటు చేశారు. బైక్‌కు పెట్రోల్‌, మనిషికి రూ.500 కిరాయి, ఆటోలకు టోకెన్లు లెక్కపెట్టి ఇవ్వడంతో టీడీపీ నేతలు అవమానంగా భావించారు. వాగ్వాదాలకు దిగారు. కొన్ని గ్రామాల్లో గొడవలు లేకుండా కొణతాల అనుచరులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement