నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్
మార్కాపురం జిల్లాలోకి దొనకొండ, కురిచేడు మండలాలు
కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్
జిల్లాల పునర్విభజనలో మార్పు చేర్పులు.. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో చేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
గత నెల 27న కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా వివిధ మార్పులపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా... వాటిపై రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. కాగా, సమావేశంలో రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయడంపై చర్చ జరిగింది. ప్రజల సూచనలకు అనుగుణంగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.
విస్తీర్ణంలో పెద్దదైన ఆదోని మండలాన్ని రెండుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులు అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లో, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాను ప్రతిపాదించిన విధంగా మనుగడలోకి తీసుకురానున్నారు.
మరికొన్ని మార్పులు ఇలా..
శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు, అద్దంకి డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిశపాడు మండలాలను ప్రకాశం జిల్లాలోకి మార్పు.
» కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి.
» కందుకూరు డివిజన్‌లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చాలి. కందుకూరు డివిజన్‌లోని మిగిలిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లో చేర్చాలి.
» చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరుకు, చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చాలి. సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలి.
» శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. కదిరి డివిజన్‌లోని ఆమదగురు మండలం పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల పెనుకొండ డివిజన్‌లో చేర్పు. ఈ మార్పుచేర్పులతో ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


