ఫ్రీహోల్డ్ భూములపై ఏడాదిన్నరగా కక్ష
20 లక్షల మంది రైతులు లబోదిబో
సాక్షి, అమరావతి: దశాబ్దాల పాటు సాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములపై చంద్రబాబు సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 13.59 లక్షల ఎకరాలపై చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ఏడాదిన్నర నుంచి వాటిని నిషేధిత జాబితా 22ఏలో చేర్చి ఇబ్బందిపెడుతోంది.
తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేయకుండా వాటన్నిటినీ వివాదాల్లో ముంచిన చంద్రబాబు... వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణ కారణంగా లబ్ధి పొందిన 20 లక్షల మంది అసైన్డ్ భూముల రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. తమ హక్కులను అనుభవించనివ్వాలని రైతులు వేడుకుంటున్నా చంద్రబాబు కనికరించడం లేదు. వారిని కుట్రదారులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి నడుంబిగించి అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసింది. దశాబ్దాల పాటు భూములపై ఏ హక్కులు లేకుండా కేవలం సాగుకే పరిమితమైన పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇతర పేద రైతులు ఎన్నో ఏళ్లుగా కోరినా, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి మేలు చేయాలని నిర్ణయించింది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్ర రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులు అయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసి దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది.
కొందరు అమ్ముకోవడం తప్పా?
హక్కులు వచ్చిన రైతుల్లో కొందరు భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అమ్ముకున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం వివాదంగా మార్చింది. వాస్తవానికి ఇలా క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలినవన్నీ అసైనీల చేతుల్లోనే ఉన్నాయి. కానీ, రైతులకు మేలు చేసే ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని... వాటిని 22ఏ జాబితాలో పెట్టింది. దీంతో రిజి్రస్టేషన్లు జరగడం లేదు. సంబంధిత రైతులు రుణాలు కూడా తీసుకోలేకపోతున్నారు.
10 లక్షల ఎకరాలు సక్రమమని తేలినా...
కూటమి ప్రభుత్వ విచారణలోనే 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలింది. ఏడాదిన్నరగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణ చేయిస్తూనే ఉంది. రెండుసార్లు వెరిఫికేషన్ చేసి, అధికారుల కమిటీలతో విచారణ జరిపించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల సంఘం అరడజనుసార్లు సమావేశమైనా ఏమీ తేల్చలేదు. ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి రెవెన్యూ శాఖ విచారణలో సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది.
మిగతా 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పినా అవి ఏమిటనేది కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై వివాదాలు సృష్టించారు. ఎక్కడైనా అధికారులు, భూ మాఫియాకు చెందినవారి వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దాల్సింది పోయి అన్నింటినీ వివాదాస్పదంగా చూపుతూ చంద్రబాబు సర్కారు రైతుల కడుపు కొడుతోంది. రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా అసైన్డ్ రైతుల భూములను కూడా కొట్టేసే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అడ్డగోలుగా వక్రీకరించి 22ఏ జాబితాలో పెట్టారు
అసైన్డ్ భూముల చట్టానికి సవరణ ద్వారా జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనిని వక్రీకరించి 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు టీడీపీ మంత్రులు, నేతలు అడ్డగోలుగా వాదించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీ హోల్డ్ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది.
ఇంకా ఎక్కడైనా ఉల్లంఘనలుంటే విచారణ జరిపి మిగిలిన భూములపై ఆంక్షలు ఎత్తివేయాలి. కానీ, ఆ పని చేయడంలేదు. వైఎస్ జగన్ హయాంలో యాజమాన్య హక్కులు రావడమే వారికి శాపంగా మారింది. ఫ్రీహోల్డ్ భూముల రిజి్రస్టేషన్లకు అనుమతి ఇస్తే అది చేసింది వైఎస్ జగన్ కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దానిపై నిత్యం బురద జల్లుతూనే ఉంది. దీంతో లక్షలాది మంది రైతులు లబోదిబోమంటున్నారు.


