పీహెచ్‌సీ ఆవరణలో ఆటస్థలం వద్దు
నాతవరం : స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో ఆట స్థలం ఏర్పాటు చేయరాదని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండల ప్రత్యేకాధికారి మంగవేణికి ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న నియంత వ్యవహార శైలిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం కొంతసేపు నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాతవరంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు ఇదే గ్రామానికి చెందిన దాత 1960లో స్థలం ఉచితంగా ఇచ్చారన్నారు. ఆ స్థలంలో అప్పట్లో నిర్మించిన భవనం శిథిలం కావడంతో గత వైఎస్సార్‌సీపీ హయాంలో సుమారుగా రూ.2 కోట్లతో నూతన భవనం నిర్మించామన్నారు. ఈ పీహెచ్‌సీని 30 పడకల స్థాయికి పెంచేందుకు గతంలో ప్రతిపాదనలు చేశామన్నారు. ఇటీవల ప్రభుత్వం నాతవరం గ్రామంలో ఆటలు అడుకునేందుకు గ్రౌండ్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రౌండ్ నిర్మాణం స్థానిక కూటమి నేతల ప్రోత్సాహంతో పీహెచ్‌సీ స్థలంలో పనులు చేపట్టారన్నారు. పీహెచ్‌సీ స్థలంలో ఆటస్థలం నిర్మాణం చేస్తే పీహెచ్‌సీకి అప్‌గ్రేడ్‌కు స్థల సమస్య వస్తుందన్నారు. గ్రౌండ్ నిర్మాణం కోసం స్థలం నాతవరం గ్రామంలో నాలుగు చోట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని అక్కడ గ్రౌండ్ నిర్మిస్తే అందరికి బాగుంటుందన్నారు. నాతవరం గ్రామంలో గ్రౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లుగా గానీ పీహెచ్‌సీ స్థలంలో ఆట స్థలం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ పాలకవర్గానికి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేకాధికారి జి, మంగవేణిి మాట్లాడుతూ మీరు చెప్పిన విషయం పరిశీలిస్తానన్నారు. కార్యక్రమంలో గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి గొర్లె వరహాలబాబు, వైఎస్సార్‌సీపీ నాతవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి లచ్చబాబు, వైఎస్సార్‌సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు వైఎస్సార్‌సీపీ మండల మహిళా ఉపాధ్యక్షురాలు రాధ, నాతవరం మాజీ ఉప సర్పంచ్ రాంబాబు, సోషల్ మీడియా అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ, పార్టీ నాయకుడు అపిరెడ్డి మహేష్, రామకృష్ణ పాల్గొన్నారు.


