ప్రజా ఉద్యమాలపై కక్ష సాధింపు చర్యలు తగవు
అనకాపల్లి : ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా పీడీయాక్ట్ కేసు నమోదు చేసి, జైల్లో పెట్టడం అన్యాయమని, బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల సహకారంలో ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు ఎన్.భద్రం అన్నారు. స్థానిక మొయిన్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో విషపూరిత బల్క్ డ్రగ్ పార్కుకు భూములు కోల్పోతున్న రైతులు జరుపుతున్న ఉద్యమానికి అండగా నిలిచారని నెపంతో అనకాపల్లి జిల్లా సీపీఎం నాయకుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనకాపల్లి సీపీఐ జోనల్ కార్యదర్శి తాకాశి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


