డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీవారి దివ్య దర్శనం, సర్వ దర్శనం టోకెన్లు బంద్
గోవిందమాల ధరించిన భక్తులకూ తప్పని తిప్పలు
తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నిర్ణయం
ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
ఇతరులెవరూ ఆ రోజుల్లో తిరుమలకు రావొద్దని ప్రకటన
టీటీడీ ఒంటెత్తు పోకడలపై మండిపడుతున్న శ్రీవారి భక్తులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దివ్య దర్శనం, టైం స్లాట్ టోకెన్ల పంపిణీని ముందుగానే నిలిపి వేసింది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావొచ్చని ప్రకటించింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అందని ద్రాక్షలా మారింది.
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ, చదువుకోని భక్తులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా లక్కుంటేనే వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అమలు చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లటం ఆనవాయితీ. ముఖ్యంగా కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చే వారిలో టోకెన్లు కలిగిన వారు, లేని వారూ ఉంటారు. ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు పొందలేని భక్తులు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు.
ఆ 3 రోజులూ తిరుమలకు రావొద్దు
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1వ తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ నిలిపి వేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారిని మాత్రమే సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది.
జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్లో సర్వ దర్శనం కోసం అనుమతిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు, నడక మార్గంలో వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దినపత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అదే విధంగా గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మాల ధరించిన భక్తులు కూడా సర్వ దర్శనం ఆన్ లైన్ టికెట్లు ఉంటేనే అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయం ఏపీ, తెలంగాణా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులకు కూడా తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.
నిర్వహణ చేతకాకేనా?
గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టోకెన్ల కోసం తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కొల్పోగా, దాదాపు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తమ చేతికి మట్టి అంటకుండా అన్ని టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచి చేతులు దులుపుకుందని, నిర్వహణ చేతకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని భక్తులు విమర్శిస్తున్నారు.
టీటీడీ తాజా నిర్ణయం కారణంగా తొలి మూడు రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు దూరం అయ్యారు. లక్కీ డిప్ పేరుతో టీటీడీ పాలక మండలి భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో శ్రీవారి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని చెబుతున్నారు.
స్థానికుల పైనా వివక్ష!
చంద్రబాబు పాలనలో డిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి తమను శ్రీవారి దర్శనానికి దూరం చేశారని స్థానికులు, స్థానికేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉంటే.. కేవలం 15 వేల టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించి టికెట్లు ఇవ్వక పోవటంపై భక్తులు మండిపడుతున్నారు.
వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు కుటుంబాలతో సహా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేసి, నేరుగా భక్తులకు టోకెన్లు పంపిణీ చేశారు. క్యూలైన్లో వచ్చిన వారు వచ్చినట్లు టోకెన్లు తీసుకుని వెళ్లేవారు. స్థానికులతో పాటు అలా ఎంతో మందికి శ్రీవారి దర్శన అవకాశం కలిగింది.


