జనసేనకు ‘కొత్త’ తలనొప్పి  | Pawan Janasena Faces Headache From Konathala | Sakshi
Sakshi News home page

జనసేనకు ‘కొత్త’ తలనొప్పి.. ఇంతకి అలకవీరుడికి సీటెక్కడ? 

Feb 19 2024 1:23 PM | Updated on Feb 19 2024 2:29 PM

Pawan Janasena Faces Headache From Konathala - Sakshi

ఎన్నికలొచ్చినప్పుడల్లా.. ఆయన అలకపాన్పు ఎక్కుతాడు. మరి సోదరుడు నాగబాబు విషయంలో.. 

అలగడమే అలంకారంగా భావించే సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ.. జనసేనలో చేరీ చేరడంతోనే తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేది తానేనని ఫిక్స్ అయిపోయాకనే అయన జనసేనలో చేరారు. వాస్తవానికి అయన ఆలోచనలకూ విరుద్ధంగా జరిగితే వెంటనే అయన అలకపాన్పు ఎక్కుతారు.. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే.

కాంగ్రెసులోను, వైఎస్సార్ కాంగ్రెస్ లోను ఇలా ఎక్కడైనా ఆయనది అదే తీరు. ఇక చాన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న కొణతాల రామకృష్ణ మొన్నీమధ్యనే జనసేనలో చేరారు. చేరుతూనే.. తాను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అని తనకుతానే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. అనకాపల్లి నుంచి తాను పోటీ చేస్తాను అంటూ పవన్ అన్నయ్య నాగబాబు సైతం అనకాపల్లి మీద కన్నేశారు.. తరచూ అక్కడే పర్యటిస్తున్నారు. యలమంచిలి దగ్గర అయన ఉండేందుకు ఒక ఇతనికి, స్టాఫ్ కోసం ఇంకో రెండు ఇళ్లను సైతం తీసుకున్నారు. అనకాపల్లి నుంచి పోటీకి అయన ఏర్పాట్లు చేసుకున్నారు... దీంతో తన అంశాలమీద నీళ్లు పడ్డాయని గుర్తించిన కొణతాల మొన్న నిన్న అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. '

తనకు టిక్కెట్ ఇవ్వనప్పుడు ఇంకా పార్టీ సమావేశాలకు వెళ్లడం ఎందుకన్నది ఆయన భావన. ఇదిలా ఉండగా అనకాపల్లిలో ప్రధాన సామాజిక వర్గం అయిన గవర కమ్యూనిటీకి చెందిన కొణతాల అలిగితే ఇక తన గెలుపు సంగతి అటుంచి డిపాజిట్లు కూడా రావని భయపడిన నాగబాబు ఒకవైపు.. పవన్ మరోవైపు కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేనకు అనకాపల్లి,కాకినాడ,మచిలీపట్నం లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక.. కొణతాల సైతం అక్కడే కన్నేయడంతో ఇరువురిమధ్య పీఠముడి పడింది. దీంతో ఆ విభేదాలను పరిష్కరించేందుకు పవన్, నాగబాబు సైతం కొణతాల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒకవేళ అయన మెత్తబడినా ఆయనకు ఇంకోచోట ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే విశాఖలో పెందుర్తి, భీమిలి ఇలా మూడు నాలుగు సీట్లలో జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది.. ఇప్పుడు అవికాకుండా అనకాపల్లి ఎమ్మెల్యే కూడా తీసుకోవడం కష్టమే.! మరి అలాంటప్పుడు కొణతాలను ఎక్కడ ? ఎలా ఎకామిడేట్ చేస్తారో చూడాలి.

ఇక్కడ..  వైవీ చక్రవర్తి అనే అయన సైతం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా టిక్కెట్ కోసం చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం టీడీపీ కోసం గట్టిగా ఆశతో ఉన్నారు. దీంతో వీళ్ళు ఎవరికీ టిక్కెట్ లేకుండా నాగబాబుకు ఇచ్చేలా చంద్రబాబును పవన్ ఒప్పిస్తున్నారు అని అంటున్నారు.. దీంతో అనకాపల్లి కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. 

✍️సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement