Hyd: సంక్రాంతి పండుగ రద్దీ షురూ.. | Sankranti 2026 Rush Begins, Heavy Crowds At Hyderabad Bus And Railway Stations, Highway Sees Traffic Diversions | Sakshi
Sakshi News home page

Sankranti Rush Begins: సంక్రాంతి పండుగ రద్దీ షురూ..

Jan 10 2026 7:54 AM | Updated on Jan 10 2026 10:12 AM

Sankranti Rush Begins in Hyderabad

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రధానంగా నగరాలను నుంచి పల్లెలకు వెళ్లే జనం.. శుక్రవారం(జనవరి 9వ తేదీ) నుంచే  క్యూకట్టేశారు. దాంతో హైదరాబాద్‌ బిజీబిజీగా కనిపిస్తోంది.  నిన్న రాత్రి నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. ప్రధానంగా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరొకవైప ఇప్పటికే పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు.  సంక్రాంతి నేపథ్యంలో హైవే 65పై ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ   ఎక్కువగా ఉంది.  పలుచోట్ల ట్రాఫిక్‌  మళ్లింపు చర్యలు చేపట్టారు.విజయవాడ వైపు టేకుమట్ల వద్దపాత డైవర్షన్‌ ఎత్తివేశారు. రాజమండ్రి-విశాఖ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్‌వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌-గుంటూరు వెళ్లేవాహనాలు నార్కెట్‌పల్లి వైపు  మళ్లిస్తున్నారు. 
 

నియంత్రణకు చర్యలు..
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్‌లలో అదనపు సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు.  

ప్రతిరోజూ 2.2 లక్షల మంది.. 
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రస్తుతం సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతి రోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. లింగంపల్లి నుంచి 50 వేల మంది, నాంపల్లి నుంచి మరో 35 వేల మంది ప్రయాణం చేయనున్నట్లు అంచనా. దీంతో అన్నిచోట్లా అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 17 టిక్కెట్‌ బుకింగ్‌ కేంద్రాలతో పాటు 20 ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌లను అందుబాటులో ఉంచారు.  

తొక్కిసలాటకు తావివ్వకుండా.. 
రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా ఆరీ్పఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలను అందజేసేందుకు టీటీఈలను అదనంగా నియమించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరభివృద్ధి పనుల దృష్ట్యా, ప్రస్తుతం ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. పరిమితంగా  పికప్,డ్రాప్‌ సదుపాయం మాత్రం ఉంటుంది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు విశాలమైన పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

అదనపు ఏర్పాట్లు ఇలా.. 
పదో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ గేట్‌– 2, గేట్‌– 4 వద్ద కొత్త హోల్డింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు.  
 ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్‌ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు హాల్టింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. 
ప్రయాణికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టికెట్‌ బుకింగ్‌ 
కౌంటర్‌లను పెంచారు. ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లను అందుబాటులో ఉంచారు. 
 రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘రైల్‌వన్‌’ యాప్‌ ద్వారా సాధారణ టికెట్‌లు బుక్‌ చేసుకొనే ప్రయాణికులకు 3 శాతం రాయితీ లభించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement