పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు | MP Anil Kumar Yadav Expresses Anger Over Protocol Lapse At Government Event In Hyderabad | Sakshi
Sakshi News home page

పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు

Jun 15 2026 10:29 AM | Updated on Jun 15 2026 11:42 AM

MP Anil Kumar Yadav Sparks Protocol Row at Ponnam Event

తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్‌ అంశం వివాదాస్పదంగా మారింది.

స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.

అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్‌ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్‌ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement