ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్? | KSR Reaction To Telangana CM Revanth Reddy Comments Spark Debate Over Political Responsibility And Democratic Values | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్?

Jun 10 2026 10:18 AM | Updated on Jun 10 2026 11:37 AM

KSR's Comments On Telangana Chief Minister Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్.టి.ఆర్ విహ్రహ ఆవిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్.టి.ఆర్ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్పూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే, రేవంత్‌లో ఏదో భయం వెన్నాడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది.

అవసరం ఉన్నా, లేక పోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లు మాట్లాడుతున్నారా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్‌ను ఉద్దేశించి.. 'కేసీఆర్‌ రాసిపెట్టుకోండి.. మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం.. మీ పదేళ్ల పాలన.. మా రెండున్నర ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేదంటే మీరు ఫామ్ హౌస్‌కే పరిమితం కండి' అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా!

అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండటం తప్పు కాదు. దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ, దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్‌లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కాని రేవంతే పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్‌ఎస్‌ కైనా, కాంగ్రెస్ కైనా మరే పార్టీకైనా వర్తిస్తుంది.

కేసీఆర్‌ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసందే. అదేదో కేటీఆర్‌ కో, హరీష్ రావుకో సవాల్ విసిరి ఉంటే వారేమైనా స్వీకరించేవారేమో! అయితే, వారితో తనకు పొంతన ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్‌ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్‌కు ఉన్న భాష, ప్రసంగ సామర్ద్యంతో పోల్చితే రేవంత్‌కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీపడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాఫణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది. కాని ఇలా ఒకరు క్షమాపణతో, మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా!

ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్‌లో ఆయన హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు మంచిదే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి, జర్మని నియంత హిట్లర్ సమయంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.

మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలనలో డిక్టేటర్ షిప్ చూసిన తర్వాత హిట్లర్‌ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ను సమర్ధించేవారు కారు. చివరికి  యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశం అయితే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్, ఇజ్రాయిల్  యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏ మాత్రం సెన్సిబుల్‌గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న వస్తుంది. అంతేకాదు. నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించానని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్‌ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా? అన్న చర్చ కూడా వస్తుంది.

హైదరాబాద్‌లో హైడ్రా టీమ్ యాక్టివిటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచిపేరే వచ్చి ఉండవచ్చు కాని అదే టైమ్ లో అవసరం ఉన్నా, లేకపోయినా పేద, మధ్య తరగతివారి ఇళ్ళలను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పు పట్టింది. ఆ సంగతి బహుశా రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తనను తాను హిట్లర్‌తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్పూర్తి అవుతారు?

అసలు హిట్లర్ టీమమ్‌కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా, ఎట్టి పరిస్థితిలోను దానిని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయమూ ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే! అది వాస్తవమా? కాదా? అన్నది చెప్పలేదే! అందువల్లే బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ తన కామెంట్‌లో హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు చేస్తున్నారని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు.

రేవంత్ నిరంకుశ, పాష్టిస్ట్ మనస్తత్వం దేశం అంతటికి అర్థం అయిందని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు. తమకు మాత్రం మహాత్మా గాంధీజి, అంబేద్కర్, జయశంకర్‌లు స్పూర్తి అని కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. దీనిని రాజకీయ విమర్శగా చూడవచ్చు. అది వేరే సంగతి. రేవంత్ కు మిగిలిఉన్న ఇమేజీని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు. ఏది ఏమైనా రేవంత్ కు స్పూర్తి నివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటివారు కాని హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement