హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్‌.. రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ? | Kommineni Srinivasa Rao Comments On HYDRA Commissioner | Sakshi
Sakshi News home page

హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్‌.. రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ?

Jul 29 2026 11:04 AM | Updated on Jul 29 2026 12:31 PM

Kommineni Srinivasa Rao Comments On HYDRA Commissioner

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్‌తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్‌కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్‌ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. 

రంగనాథ్‌ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్‌ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. 

హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.

మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్‌ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. 

ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. 

రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.

ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. 

కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో.  యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement