కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా! | KSR's Comments On The Sanction Of Funds For Amaravati Construction By The TDP | Sakshi
Sakshi News home page

కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!

Jun 29 2026 11:21 AM | Updated on Jun 29 2026 1:23 PM

KSR's Comments On The Sanction Of Funds For Amaravati Construction By The TDP

రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్‌ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్‌లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.

అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్‌లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్‌ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్‌లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.

ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్‌లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్‌గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.

ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్‌మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.

అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.

హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్‌లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.

ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.

ప్రపంచ బ్యాంక్‌కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.

దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement