చంద్రబాబు కుర్చీలాట.. పావుగా పవన్‌ కల్యాణ్‌! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుర్చీలాట.. పావుగా పవన్‌ కల్యాణ్‌!

Published Mon, Dec 25 2023 12:14 PM

KSR Comments Over Chandrababu And Pawan Kalyan - Sakshi

విశాఖపట్నంలో యువగళం విజయోత్సవం పేరుతో జరిగిన తెలుగుదేశం సభ ఎలా నడిచింది?. జనం బాగానే వచ్చారా?. వచ్చిన ప్రజలు స్పందించిన తీరు ఎలా ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తుంటాం. ఈ సభ గురించి విశ్లేషించుకుంటే పలు ఆసక్తికర అంశాలు  కనిపిస్తాయి.

✍️ఈ సభలో ప్రధాన వక్తలుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ, జనసేన అధినేత  పవన్ కల్యాణ్‌ల స్పీచ్‌లు నీరసంగా సాగడం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఈ సభకు సమన్వయకర్తగా వ్యవహరించి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ల ఉపన్యాస తీరే వారికంటే ఎంతో కొంత బాగుందని చెప్పాలి. వీరిద్దరు చెప్పిన విషయాలతో ఏకీభవించకపోయినా, వారి వాగ్దాటి బెటర్‌గా కనిపించింది. చంద్రబాబు నాయుడేమో అదేదో సినిమా ఫంక్షన్‌లో యాంకర్ మాదిరి అటూఇటూ తిరుగుతూ, చెప్పిన అబద్దం చెప్పకుండా జనాన్ని బోర్ కొట్టించారనిపిస్తుంది. 

✍️పవన్ యథా ప్రకారం ఆడపిల్లల గురించి అవమానరీతిలో మాట్లాడి ఆత్మ సంతృప్తి చెందారు. లోకేష్ తన పిచ్చిగోల ప్రకారమే స్పీచ్ ఇస్తే, బాలకృష్ణ ప్రసంగం అంతా అదేదో మెంటల్ అన్న భావన కలిగేలా ఉందనిపిస్తుంది. సభికులు ఎప్పుడో తప్ప, పెద్దగా స్పందించింది లేదు. ఏదో తీసుకువచ్చారు.. వచ్చాం.. వెళ్లేవరకు కూర్చోవాలి అన్నట్లుగా కొంతమంది ఉసూరుమంటూ కూర్చుంటే, మరి కొంతమంది మాత్రం సభ మధ్యలోనే జారుకున్నారు. సాధారణంగా రెండు రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు కలిస్తే ఉండవలసిన జోష్ అందులో కనిపించలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సభకు రాకుండా ఉండాల్సింది. తొలుత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆయనకు కాస్త గౌరవం అన్నా మిగిలేది. ముందుగా అలిగినట్లు కనిపించి, ఆ తర్వాత ఈ సభకు రావడంతో ఏదో ప్యాకేజీ కుదిరిందన్న విమర్శకు ఆస్కారం ఇచ్చినట్లయింది. 

✍️చంద్రబాబుకు సరెండర్ అయ్యారనుకుంటే, విశాఖ సభలో ఆయన స్పీచ్ వింటే లోకేష్‌కు కూడా సరెండర్ అయిపోయారన్న విషయం అర్దం అవుతుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధి అనడానికి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇష్టపడడం లేదని మరోసారి తేలిపోయింది. లోకేష్ అయితే  ఏకంగా చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అని, ఆయనే సమర్ధుడని తాను  ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే పవన్‌కు అనుభవం లేదని, సమర్ధుడు కాదని పరోక్షంగా చెప్పడమే కదా అన్న విశ్లేషణ సహజంగానే వస్తుంది. పోనీ అక్కడితో ఆగారా! మరో ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పదవి పవన్‌కు ఇవ్వడానికి కూడా టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం కావాలన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. 

✍️ఒక విధంగా లోకేష్ తన మనసులోని మాటను చెప్పేశారనుకోవాలి. బహుశా అది చంద్రబాబు అనుమతితోనే జరిగి ఉండాలి. లేకుంటే చంద్రబాబు ఖండించేవారు కదా! పవన్ కల్యాన్‌ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవిపై చంద్రబాబు, తాను చర్చించుకుని నిర్ణయించుకుంటామని చెబితే, లోకేష్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. తాను చంద్రబాబు సమాన స్థాయిలో ఉన్నామని పవన్ ఫీల్ అవుతుంటే, ఆయనకు అంత సీన్ లేదని లోకేష్ కుండబద్దలు కొట్టి చెప్పినట్లుగా ఉంది. తాను తెలుగుదేశం వెనుక నడవడం లేదని, పక్కన నడుస్తున్నానని పవన్ జనసైనికులను నమ్మించడానికి యత్నిస్తున్నా, లోకేష్ అసలు విషయం వెల్లడించి జనసేన వారికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది జనసేనవారేనని స్పష్టం చేశారన్నమాట. 

✍️ఈ నేపథ్యంలో  పవన్ ఆత్మగౌరవంతో  వ్యవహరించకుండా, విశాఖ సభకు వెళ్లి జనసైనికుల మనసులను గాయపరిచారు. తమకు ఉన్న ఆత్మాభిమానం కూడా పవన్‌కు లేకుండా పోయిందని జనసైనికులు బాధపడుతన్నారు. లోకేష్ తన తల్లిని దూషించారని చెప్పిన పవన్ ఆ మాట మర్చిపోయి ఆయన పక్కన కూర్చుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌పై పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన కార్యకర్తలను అలగా జనం అన్న బాలకృష్ణ చెంత పవన్ ఆసీనుడు అవడమే కాకుండా ఆయనను పొగిడే దశకు వెళ్లారు. బాలకృష్ణ ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఆయనేమో ఉచితాలు ప్రజలకు ఇవ్వవద్దని చెబుతుంటే, లోకేష్, చంద్రబాబులు తాము ఇవ్వబోయే ఉచితాల గురించి ఓ పెద్ద జాబితా చదివారు. లోకేష్ తన ఎర్ర పుస్తకాన్ని ఎర్రి పుస్తకంగా మార్చి అందులో ఏవో పేర్లు రాసుకున్నానని చెబుతున్నారు. ఎవరైనా నేత ప్రజలలో తిరిగినప్పుడు వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తెలియచేసిన సమస్యల గురించి కాకుండా ఎవరిని కొట్టాలి.. ఎవరిని తిట్టాలి.. అధికారంలోకి వస్తే ఎవరిని వేధించాలి.. అన్న విషయాలు రాసుకున్నారంటేనే ఈయనకు రాజకీయాలపై ఉన్న అవగాహన ఏమిటో తెలుస్తుంది.

✍️చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేనల పొత్తు తమకోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని నమ్మబలకాలని యత్నిస్తున్నారు. చంద్రబాబు అన్న వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు, ఇంతవరకు అధికారంలో లేనట్లు, కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వచ్చినట్లు స్పీచ్ ఇస్తున్న వైనం చూస్తే జనాన్ని ఎలా మోసం చేయాలా అన్నదానిపైనే ఆయన దృష్టి పెట్టారని తెలిసిపోతుంది. కేవలం తన పుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన తంటాలు పడుతున్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, విభజన తర్వాత ఏపీలో కానీ.. ఈ ప్రాంతానికి ఏం చేసింది అనేది ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. పోనీ.. సీఎం జగన్ తీసుకువచ్చిన పలు స్కీములు, పాలన సంస్కరణల గురించి  మాట్లాడారా అంటే అదీ లేదు. వాటిలో  ఉన్న లోటుపాట్లు ఏమిటి? ఆయన అధికారంలోకి వస్తే తీసుకు వచ్చే మార్పులు ఏమిటి అన్నది వివరించారా అంటే ఒక్క ముక్క కూడా లేదు. 

✍️తాను ఉంటే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అని డబ్బా కొట్టుకోవడం వరకు అభ్యంతరం లేదు. కాని తాను సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదన్న ప్రశ్న ప్రజలకు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు వస్తుందని మాత్రం ఆయన అనుకోవడం లేదు. ఏవో కొన్ని అసత్యాలు చెప్పడం, రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రచారం చేయడం, మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్కీములనే మరింతగా అమలు చేస్తామని చెప్పడం అంతా పరస్పర విరుద్దంగా కనిపిస్తుంది. జనసేనతో పొత్తు గురించి ఎవరూ ప్రశ్నించరాదని ఈయన కూడా తన కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పవన్ తన పార్టీ వారిని ఇప్పటికే అదే రీతిలో బ్లాక్ మెయిల్ చేశారు. లోకేష్ ఏకంగా తాడేపల్లి పాలెస్ బద్దలు కొడతారట. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారట.. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో సభలో ఉపన్యాసం ఇస్తే జనం నమ్ముతారా? బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందా? అవ్వదా?. మహిళలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున జమ చేస్తే రాష్ట్రం ఆర్దికంగా మరింత కుంగిపోతుందా?లేదా?. అసలు దానికి ఎంత డబ్బు కావాలి? అదంతా ఎక్కడ నుంచి తెస్తారు?. మూడు గ్యాస్ బండలు ఫ్రీగా ఇవ్వడానికి ఎంత వ్యయం అవుతుంది. 

✍️బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల చొప్పున ఇవ్వడం సాధ్యమేనా?. ఇలాంటి వాటి గురించి ప్రజలకు వివరణ ఇవ్వడానికి వీరిలో ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఆచరణకాని హామీలను  ప్రజలపై వర్షం మాదిరి కురిపించడానికి చంద్రబాబు, లోకేష్‌లు పోటీ పడ్డారు. జనం వీటిని నమ్ముతారా? లేదా ? అన్నదాని గురించి పట్టించుకోలేదు. వీరు ఏమి చేసినా భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటివి ఉన్నాయి కనుక వీరు ఇష్టారీతిలో ఉపన్యాసాలు చేసేస్తున్నారు. ఆ మీడియానేమో పేజీల కొద్ది, గంటల కొద్ది తమ పత్రికలలో, టీవీలలో ప్రచారం చేసి జనాన్ని ఎంత వీలైతే అంత మోసం చేయాలని విశ్వయత్నం చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఏమీ జరగలేదని వీరు విమర్శించడం విచిత్రంగానే ఉంటుంది. 

✍️ఒక పక్క విశాఖలో అభివృద్ది పనులు చేపడుతుంటే వాటిని అడ్డుకుంటున్న వీరిని ఆ ప్రాంత ప్రజలు ఎలా నమ్ముతారో తెలియదు. చంద్రబాబు నాయుడు తన పద్నాలుగేళ్ల కాలంలో చేయలేకపోయిన కిడ్నీ పరిశోధనకేంద్రం, సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని పలాసలో ఏర్పాటు చేయడమే కాకుండా, పలాస, ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాలలోని 800 గ్రామాలకు శుద్ది చేసిన నీరు ఇవ్వడానికి 700 కోట్లతో భారీ నీటి స్కీమును ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ది కాదా?. అది అభివృద్ది కిందకు రాదా?. పవన్ గతంలో అక్కడకు వెళ్లి హడావుడి చేశారు కదా!. సీఎం జగన్‌పై ద్వేషంతో కాకపోతే, ఒక్కమాట అన్న ఈ స్కీమ్ గురించి చెప్పాలి కదా!ప్రభుత్వాన్ని అభినందించాలి కదా!. కానీ, ఆయన నోరు పెగలలేదు. పైగా సీఎం జగన్  ఏమీ చేయలేదని అబద్దాలు చెప్పడం. కాకపోతే సోనియాగాంధీ కక్షకట్టి సీఎం జగన్‌పై కేసులు పెట్టిందని తెలిసో, తెలియకో చెప్పేశారు. చంద్రబాబుపై కూడా కక్ష కేసులు పెట్టారని  చెప్పడానికి గాను ఆయన ఈ మాట అన్నారు. 

✍️సోనియాగాంధీతో పాటు, చంద్రబాబు కూడా కలిసే ఆ రోజుల్లో సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. తాను ఉంటే భోగాపురం, పోలవరం పూర్తి అయిపోయేవని చంద్రబాబు అసత్యాలు చెప్పారు. భోగాపురం విమానాశ్రయంకు అవసరమైన అనుమతులు వచ్చింది ముఖ్యమంత్రి జగన్ హయాంలో కాదా.  పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఆయన ప్రభుత్వ నిర్వాకం కాదా?. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని చంద్రబాబుపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణ గురించి ఇన్నేళ్లలో ఒక్కసారైన ఎందుకు ఆయన నోరు విప్పలేదు?. స్వోత్కర్ష, పరనిందకు బాగా అలవాటు పడ్డ చంద్రబాబు యధాప్రకారం జీవితంలో ఇంత సభ చూడలేదని చెప్పారు. ఆయన ఏ చిన్న సభకు వెళ్లినా, పెద్ద సభకు వెళ్లినా ఇదే మాట చెబుతుంటారు. అది ఆయనకు మా చెడ్డ అలవాటు. దానిని ప్రజలు భరించక తప్పదు.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement
 
Advertisement