ఉల్లి రైతును ఆదుకోవడంలో చెప్పేదొకటి.. చేసేదొకటి
ప్రతి ఎకరాకు రూ.20వేలు పరిహారం అని ప్రకటించి గరిష్టంగా ఐదు ఎకరాలకే అంటూ కోత
రూ.పదివేలకు కుదించిన వైనం
8,205 ఎకరాలకు రాష్ట్రం ఇచ్చేది ఎకరాకు రూ.పదివేలే
మిగిలిన రూ.10 వేలు కేంద్రం ఇస్తుందని తప్పించుకునే ఎత్తుగడ
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతును చంద్రబాబు సర్కారు అడుగడుగునా దగా చేస్తోంది. పదేపదే హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా నాలుక మడతేసి ఏమారుస్తోంది. గతంలో మద్దతు ధర అంటూ మాయ చేసిన చంద్రబాబు ఆ తర్వాత ప్రతి ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం అంటూ మాట మార్చి, ఇప్పుడు దాని విషయంలోనూ రైతులను మోసం చేశారు. గరిష్టంగా ఐదు ఎకరాలకే అంటూ విస్తీర్ణంలో కోత పెట్టారు. అందులోనూ 8,205 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలే ఇస్తుందని, మిగతాది కేంద్రం ఇస్తుందని తప్పించుకునే ఎత్తుగడ వేశారు. శనివారం నుంచి పరిహారం పంపిణీకి సిద్ధమైన నేపథ్యంలో సర్కారు మోసాలపై ఉల్లిరైతులు లబోదిబోమంటున్నారు.
మద్దతు ధర అంటూ తొలుత హడావుడి
తొలుత ఉల్లిగడ్డలను మద్దతు ధర రూ.1200తో కొంటామని హడావుడి చేసిన సర్కారు ఆ తంతును మున్నాళ్ల ముచ్చటగా ముగించింది. ఇందులోనూ కొందరికి రూ.400 కోత పెట్టింది. 2025 జూలై, ఆగస్టుల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఓ దశలో క్వింటా ఉల్లికి రూ.50 మాత్రమే పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం రూ.1200 మద్దతు ధరతో కొంటామని ప్రకటించింది. 2025 ఆగస్టు 30న మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినా.. సెప్టెంబర్ 20వరకు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా 9,020 టన్నుల ఉల్లిని సర్కారు కొన్నది. ఇందులో 6,776 టన్నులకు మాత్రమే రూ.1200 మద్దతు ధర ఇచ్చింది. 2244 టన్నులకు నాణ్యత లేదనే సాకుతో రూ.800లు మాత్రమే చెల్లించింది.
మద్దతు ధర పోయే.. పరిహారమూ సగమే..
ఆ తర్వాత మళ్లీ మద్దతు ధర స్థానంలో ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించింది. పెట్టిన పెట్టుబడిని చూస్తే ఈ మొత్తం గిట్టుబాటు కాదని రైతులు చెప్పినా సర్కారు చెవికెక్కించుకోలేదు. ఆ తర్వాత పరిహారం విషయంలోనూ నాలుక మడతేసింది. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాలకే( 2 హెక్టార్లు) అంటూ మెలిక పెట్టింది. దీంతో 3,650 ఎకరాలకు పరిహారం లేకుండా పోయింది. 5 ఎకరాల వరకు అని లోపాయికారిగా నిబంధన పెట్టడం వల్ల రైతులు రూ.7.30 కోట్లు నష్టపోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఖరీఫ్‌లో 61,660 ఎకరాల్లో ఉల్లి సాగయింది. ఇందులో 3949.8 ఎకరాల్లో పండించిన ఉల్లిని మార్క్‌ఫెడ్ మద్దతు ధరతో కొనుగోలు చేసింది.
మిగిలిన దానిలో 54,061 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తోంది. వెరసి 58,010 ఎకరాలకు లబ్ధి చేకూరుతోందని సర్కారు చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం 45,856 ఎకరాలకే రూ.20 వేలు పరిహారం లభిస్తుంది. మిగిలిన 8,205 ఎకరాలకు చెందిన 6,222 మంది రైతులకు రూ.10 వేల చొప్పునే పరిహారం ఇస్తామని గమనార్హం. 8,205 ఎకరాల్లో ఎకరాకు రాష్ట్రం రూ.10 వేలు, కేంద్రం టాపప్ సబ్సిడీ కింద రూ.10 వేలు చెల్లిస్తుందని సర్కారు చెబుతోంది. మరి ఇది ఏ మేరకు అమలవుతుందోనని రైతులు పెదవి విరుస్తున్నారు.
నేడు పరిహారం పంపిణీకి శ్రీకారం
సీఎం చంద్రబాబు గత ఏడాది సెప్టెంబరు 18న ఉల్లి సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రకటించినా.. ఆదుకోవడంలో తీవ్ర జాప్యం చేశారు. అనేక కోతల అనంతరం ఉల్లి రైతులకు పరిహారం పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ నెల 3న శ్రీకారం చుట్టనున్నారు. అయితే 2022 ఏప్రిల్ వరకు కర్నూలు జిల్లాలో భాగమైన నంద్యాల జిల్లాకు పరిహారం చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉల్లి రైతులకు పరిహారం కింద సర్కారు రూ.128.33 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కర్నూలు జిల్లాలో 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 6,400 మంది రైతులకు రూ.28.41 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి కోడుమూరులో పరిహారం పంపిణీని నిర్వహించనున్నారు.
మద్దతు ధరేదీ బాబూ..!
ఈ చిత్రంలో కనిపించే ఉల్లి రైతు పేరు కే.పెద్ద దస్తగిరి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎస్.లింగందిన్నె స్వగ్రామం. 2025 ఖరీఫ్‌లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు. సెప్టెంబర్ 15న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధర రూ.1200 ప్రకారం 120 క్వింటాళ్లు అమ్మాడు. వ్యాపారులు క్వింటాను రూ.75కు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1200 మద్దతు ధర హామీ ప్రకారం.. వ్యాపారులు చెల్లించిన రూ.75 మినహాయించి మిగిలిన రూ.1,125 చొప్పున 120 క్వింటాళ్లకు రూ.1,35,000 ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా చెల్లించాల్సి ఉంది. కానీ ఇంతవరకు సర్కారు నుంచి చిల్లిగవ్వ అందలేదు. కర్నూలు జిల్లాలో ఇలాంటి రైతులు 1113 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి సర్కారు రూ.7.53 కోట్లు చెల్లించాల్సి ఉంది.


