తమాషా చేస్తున్నావా? నీ కథ చూస్తా! | TDP MLA In Nandyal Sparks Controversy, Scolds Woman Party Worker Over Relief Fund Issue, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

తమాషా చేస్తున్నావా? నీ కథ చూస్తా!

Jan 3 2026 9:26 AM | Updated on Jan 3 2026 11:02 AM

tdp mla controversial comments woman worker

టీడీపీ మహిళా కార్యకర్తపై నోరు పారేసుకున్న 

శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా 

సాక్షి, నంద్యాల జిల్లా: ‘ఏం తమాషా చేస్తున్నావా.. ఇప్పటి నుంచి నీ కథ చూస్తా’ అంటూ నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఓ మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని ఎ.కోడూరులో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌తో పాటు ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త భారతి ఎమ్మెల్యేతో తన గోడు వినిపించేందుకు ప్రయత్నం చేసింది. 

తన మనవడు గుండె సమస్యతో బాధపడుతుంటే మీరు పట్టించుకోలేదని ప్రశ్నించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆ పేపర్లు కూడా ముట్టుకోలేదని వాపోయింది. ఇందుకు ఎమ్మెల్యే ‘50 మందిలో ఓ ఎమ్మెల్యేను నిలదీస్తే గొప్ప అనుకుంటున్నావా? నన్ను ఎవరనుకుంటున్నావు?’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పక్కనున్న నాయకులు ఆమెకు సర్దిచెప్పబోగా అక్కడ రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వల్లే తన మనవడు చనిపోయాడని భారతి ఆరోపించింది.

 ఇంతలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఏం తమాషా చేస్తున్నావా.. ఇక నుంచి నీ కథ చూస్తా.. అనడంతో అక్కడున్న అధికారులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు నివ్వెరపోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల ఓ అటవీ అధికారిపై చేయి చేసుకోవడం, ఇప్పుడు తమ పార్టీకే చెందిన మహిళా కార్యకర్తపై నోరు పారేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా, తమ బాధలు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీ తరహాలోనే టీడీపీ నేతలు వ్యవహరిస్తుండటం గమనార్హం.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement