మూడు నెలల్లో మళ్లీ రూ.17,500 కోట్ల అప్పు
ఆర్‌బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కారు
దీంతో మూడు నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్‌బీఐ
వచ్చే మంగళవారం రూ.6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై
వారం వ్యవధిలోనే రూ.10,500 కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: అప్పుల క్యాలెండర్‌తో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) బాబు సర్కారు రూ.17,500 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో ఆర్‌బీఐ శుక్రవారం మూడు నెలల బాబు సర్కారు అప్పుల క్యాలెండర్‌ను ప్రకటించింది. బాబు ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తున్నా, సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు, యువతకు ఉద్యోగాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్‌ను మాత్రం ప్రకటించడం లేదు.
ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు కూడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో మూడు నెలల్లో చేసే అప్పుల్లో వచ్చే మంగళవారం అంటే ఈ నెల 6వ తేదీన రూ.6,500 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్‌బీఐ నోటిఫై చేసింది. గత మంగళవారం నాడే బాబు సర్కారు రూ.4,000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారం వ్యవధిలోనే రూ.6,500 కోట్లు అప్పు చేస్తోంది. అంటే వారం వ్యవధిలోనే బాబు సర్కారు ఏకంగా రూ.10,500 కోట్లు అప్పు చేసినట్లవుతోంది.


