- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సర్కారు గ్రహణం
- పోలవరం కట్టక ముందే గోదావరి జలాలు తరలిస్తానన్న చంద్రబాబు
- 18 నెలలుగా పనుల్లో తట్టెడు మట్టిని కూడా ఎత్తలేదు
- బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు
- దివంగత సీఎం వైఎస్సార్ ముందు చూపుతో ప్రాజెక్టుకు తొలి అడుగు
- 17,560 క్యూసెక్కులతో పోలవరం ఎడమ కాలువ ద్వారా 2009 జనవరి 2న అంకురార్పణ
- ఆయన హఠాన్మరణంతో ముందుకు కదలని పనులు
- 2014–2019 మధ్య పట్టించుకోని చంద్రబాబు.. తీరా ఎన్నికలకు ముందు హడావుడి
- ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే
- 2022లో రూ.17,411 కోట్లతో చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్
- తొలి, మలి దశ పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత.. డిజైన్‌లన్నీ 2023 నాటికే ఆమోదం
- పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు.. ప్రభుత్వం మారడంతో మళ్లీ యథాస్థితి
‘అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ సామెత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లు సరిపోతుంది.. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే ఈ పథకానికి గోదావరి జలాలు తరలిస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేసింది లేదు.. 2014–19 మధ్య, ఇప్పుడు ఈ 18 నెలల్లో చేసిందంటూ ఏమీ లేదు. కనీసం తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు. అలాంటిదిప్పుడు ఈ నెలలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిధులు వెదజల్లుతారట! గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు కొనసాగేలా కూడా దృష్టి పెట్టని ఈ సర్కారు.. ప్రజలను మభ్యపెట్టడానికి సరికొత్త ‘షో’కు ఉద్యుక్తమవుతుండటం విస్మయ పరుస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తి తీర్చే బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉత్తుత్తి ‘షో’ చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని యత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు పథకానికి 2024–25 బడ్జెట్‌లో రూ.79.97 కోట్లు చూపి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2025–26 బడ్జెట్‌లో రూ.605.75 కోట్లు కేటాయించినా పైసా విదిల్చలేదు. ఫలితంగా ఈ పథకానికి గ్రహణం పట్టిందని సాగు నీటి రంగ నిపుణులు వాపోతున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలిండం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. కానీ, ఆయన హఠాన్మరణంతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఈ పథకాన్ని పట్టించుకోలేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టినట్టు చూపుతూ 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. కానీ, పైసా పని అయినా చేయనే లేదు.
వైఎస్ జగన్ చొరవతో అడుగులు ముందుకు..
సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను రూ.17,411 కోట్లతో చేపట్టేందుకు అనుమతిచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.954.09 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.
రెండో దశలోనూ పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కిలోమీటర్ల పొడవునా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రెండు ప్యాకేజీల కింద రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. వాటికి అనుబంధంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనుల డిజైన్లు అన్నింటిని 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులకు 3,822 ఎకరాలు, రెండో దశకు 12,214.36 ఎకరాల భూ సేకరణను కొలిక్కితెచ్చారు.
చంద్రబాబు రాకతో ఎక్కడి పనులు అక్కడే!
⇒ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకు.. అంటే 2024 జూలై 11న అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తానని హామీ ఇచ్చారు. కానీ, 17 నెలలైనా పనుల్లో కదలిక లేదు. 2024–25 బడ్జెట్లో తొలుత రూ.63.02 కోట్లు, సవరించిన బడ్జెట్‌లో రూ.79.97 కోట్లు కేటాయించినా, పైసా వ్యయం చేయలేదు. 2025–26 బడ్జెట్‌లో రూ.605.75 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 11న నిర్వహించిన సమీక్షలో ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి, తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటిదాక రూపాయి కూడా విడుదల చేయలేదు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా
⇒ వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు.
⇒ పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ. నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లాలో పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
⇒ పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, 106 కి.మీ పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు.
⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
⇒ ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ పురం (వీర నారాయణపురం) వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
⇒ ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీలతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు.
⇒ ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు.
⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నంలో 3.21 లక్షలు, విజయనగరంలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీరందిస్తారు.


