breaking news
Uttarandhra Sujala Sravanti
-
‘ఉత్త’ షోకు రంగం సిద్ధం!
‘అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ సామెత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లు సరిపోతుంది.. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే ఈ పథకానికి గోదావరి జలాలు తరలిస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేసింది లేదు.. 2014–19 మధ్య, ఇప్పుడు ఈ 18 నెలల్లో చేసిందంటూ ఏమీ లేదు. కనీసం తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు. అలాంటిదిప్పుడు ఈ నెలలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిధులు వెదజల్లుతారట! గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు కొనసాగేలా కూడా దృష్టి పెట్టని ఈ సర్కారు.. ప్రజలను మభ్యపెట్టడానికి సరికొత్త ‘షో’కు ఉద్యుక్తమవుతుండటం విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తి తీర్చే బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉత్తుత్తి ‘షో’ చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని యత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు పథకానికి 2024–25 బడ్జెట్లో రూ.79.97 కోట్లు చూపి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించినా పైసా విదిల్చలేదు. ఫలితంగా ఈ పథకానికి గ్రహణం పట్టిందని సాగు నీటి రంగ నిపుణులు వాపోతున్నారు.పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలిండం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. కానీ, ఆయన హఠాన్మరణంతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఈ పథకాన్ని పట్టించుకోలేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టినట్టు చూపుతూ 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. కానీ, పైసా పని అయినా చేయనే లేదు.వైఎస్ జగన్ చొరవతో అడుగులు ముందుకు..సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను రూ.17,411 కోట్లతో చేపట్టేందుకు అనుమతిచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.954.09 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.రెండో దశలోనూ పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కిలోమీటర్ల పొడవునా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రెండు ప్యాకేజీల కింద రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. వాటికి అనుబంధంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనుల డిజైన్లు అన్నింటిని 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులకు 3,822 ఎకరాలు, రెండో దశకు 12,214.36 ఎకరాల భూ సేకరణను కొలిక్కితెచ్చారు.చంద్రబాబు రాకతో ఎక్కడి పనులు అక్కడే!⇒ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకు.. అంటే 2024 జూలై 11న అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తానని హామీ ఇచ్చారు. కానీ, 17 నెలలైనా పనుల్లో కదలిక లేదు. 2024–25 బడ్జెట్లో తొలుత రూ.63.02 కోట్లు, సవరించిన బడ్జెట్లో రూ.79.97 కోట్లు కేటాయించినా, పైసా వ్యయం చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 11న నిర్వహించిన సమీక్షలో ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి, తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటిదాక రూపాయి కూడా విడుదల చేయలేదు.ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా⇒ వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ⇒ పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ. నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లాలో పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.⇒ పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, 106 కి.మీ పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ పురం (వీర నారాయణపురం) వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీలతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు.⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నంలో 3.21 లక్షలు, విజయనగరంలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీరందిస్తారు. -
ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల'
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తరలించి.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం ద్వారా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి రోజుకు ఎనిమిదివేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.20 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టింది. తొలిదశలో రూ.2,022 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం రెండోదశలో రూ.6,265 కోట్లతో రెండు ప్యాకేజీల కింద పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. అనంతరం దశలవారీగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి, గాదిగెడ్డ రిజర్వాయర్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. మొత్తం రూ.15,448 కోట్ల వ్యయమయ్యే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థికసంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి.. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి ప్రణాళిక రచించింది. మహానేత వైఎస్ మానసపుత్రిక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడువేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువ నుంచి 63.20 టీఎంసీలను తరలించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. కానీ.. అంతలోనే మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగునపడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఇదీ.. ► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 500 మీటర్ల లింకు కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటిని తరలించి.. జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండుదశల్లో ఎత్తిపోసి 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ► ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 23 కిలోమీటర్ల లింక్ కాలువ ద్వారా 6,700 క్యూసెక్కులు తరలిస్తారు. ► పాపాయపాలెం వద్ద ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తారు. ► లిఫ్ట్ కాలువ 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి కోటగండ్రేడు బ్రాంచ్ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. ► లిఫ్ట్ కెనాల్ 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్, 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్, 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్ ద్వారా తరలించి 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే తాడిపూడి రిజర్వాయర్ నింపుతారు. ► తొలిదశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ జలవనరులశాఖకు దిశానిర్దేశం చేశారు. ► రెండోదశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా 23 కి.మీ.ల లింక్ కెనాల్, 106 కి.మీ.ల లిఫ్ట్ కెనాల్, 60 కి.మీ.ల కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టడానికి రూ.6,265 కోట్లు అవసరం. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనులకు రూ.2,344 కోట్లను వెచి్చంచాల్సి ఉంటుంది. రూ.3,921 కోట్లతో లింక్ కెనాల్, లిఫ్ట్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► రెండోదశలో తొలి ప్యాకేజీకి రూ.2,539 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,382 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ పనులకు సమాంతరంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్లు నిరి్మంచడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార బిల్లులు కూడా చెల్లించని టీడీపీ సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ఓట్లకోసం టీడీపీ సర్కార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశను చేపడుతున్నట్లు ప్రకటించి 2018 నవంబర్ 15న శంకుస్థాపన చేసింది. ఆరోజున రూ.1,94,00,404 వెచ్చించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రచారం చేసుకుంది. కానీ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ప్రచార ప్రకటనల బిల్లులూ చెల్లించలేదు. ఆ బిల్లులను ఫిబ్రవరి 7న ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. -
‘ఏపీలో మళ్లీ ఉద్యమాలు’
-
‘ఏపీలో మళ్లీ ఉద్యమాలు’
విజయనగరం: ఉత్తరాంధ్రపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెండు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ నమ్మరని కొణతాల రామకృష్ణ అన్నారు.


