రేవంత్‌రెడ్డికి అసలు పరీక్ష.. బలమెంత? బలహీనతలేంటి?

Kommineni Analysis On Revanth Reddy Political Life - Sakshi

రాజకీయాలలో దుందుడుకుగా వ్యవహరిస్తే కలిసి వస్తుందా?. మామూలుగా అయితే కష్టమే. కాని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆ లక్షణమే కలిసి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన రాజకీయ జీవితం గమనిస్తే చాలా వేగంగా ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహం మార్చుకుంటూ, తన లక్ష్యానికి అనుగుణంగా ముందుకు కదలి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అంతా కలిపి పదిహేనేళ్లలో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.

✍️కేవలం ఒక పెయింటర్‌గా, ఆ తర్వాత చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ, ప్రేమ ద్వారా కాంగ్రెస్ ముఖ్యనేత జైపాల్ రెడ్డి సోదరుడి  కుమార్తెను వివాహం ఆడి తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నారు. ఒక రాజకీయ కుటుంబంతో సంబంధం పెట్టుకోవడంతోనే ఆయన అన్ని సాధించేశారని కాదు. కాని అది కూడా ఒక గుర్తింపునకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి. రాజకీయంగా ఒక జడ్పిటిసిగా గెలిచి, తదుపరి స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. తొలుత ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నా, తదుపరి కేసీఆర్ ఆరంభించిన తెలంగాణ రాష్ట్ర సమితికి  కొంత దగ్గరయ్యారు. అయినా రాజకీయంగా సొంతంగానే ఎదగాలని తలపెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు.

✍️రేవంత్ ఎమ్మెల్సీ అవడానికి అనుసరించిన వ్యూహాలను గమనించిన చంద్రబాబు నాయుడు ఆయనకు 2009లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం మరో మలుపు అని చెప్పాలి.  ఆ ఎన్నికలో ఆయన గెలిచి తన రాజకీయాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించడం, తదుపరి ఆంధ్ర నేతల నిరసనతో నిలుపుదల చేయడంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని కొత్త దశలోకి తీసుకు వెళ్లారు. తెలంగాణలోని అన్ని పార్టీలతో జెఎసి ఏర్పాటు చేసి వివిధ ఆందోళనలు చేపట్టారు. అదే టైమ్ లో పార్టీల మధ్య ఆధిపత్య ధోరణి కూడా ఉండేది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్‌లు కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత కాలంలో రెండుపార్టీల మధ్య తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండేవి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉండేవారు.

✍️అటు కాంగ్రెస్‌ను, ఇటు టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించేవారు. సోనియాగాంధీని బలిదేవత అని వ్యాఖ్యానించేవారు. టీవీ షోలలో రేవంత్ తన వాగ్దాటితో ప్రేక్షకులను ఆకర్షించేవారు. ఒక వైపు ఆంధ్ర నేతలతో, మరో వైపు తెలంగాణలోని ఇతర పార్టీల నేతలతో ఆయన వాదప్రతివాదాలు చేసేవారు. ఆంధ్ర నేత, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు, రేవంత్‌లు ఒకే షోలో ఉంటే ఆ రోజుల్లో టీవీలకు మంచి రేటింగ్ వచ్చేది. అప్పట్లో మాబోటి వాళ్లతో ఎప్పటికైనా సీఎం అవుతానని రేవంత్ అంటుండేవారు. అదెలా అని ప్రశ్నిస్తే, తన ఆలోచనలు కొంత పంచుకునేవారు. మాట దురుసుతనం కారణంగా  ఆయనంటే గిట్టని వారు కూడా బాగానే ఉండేవారు. అయినా అదే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

✍️కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ స్పీచ్ జరుగుతున్నప్పుడు రేవంత్ వేదికపైకి వెళ్లి కుర్చీ లాగేసిన తీరు వివాదాస్పదం అయింది. ఈయనతో పాటు మరో నేత నాగం జనార్ధనరెడ్డి, హరీష్ రావులు కూడా అప్పుడు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆంధ్ర నేతలపై కూడా కొన్నిసార్లు పరుష పదజాలం వాడేవారు. ఒకసారి తనకు స్నేహితుడే అయినా, సొంత పార్టీ నేత పయ్యావుల కేశవ్‌తో తగాదా పడడానికి వెనుకాడలేదు. తెలంగాణ వాదిగా గుర్తింపు తెచ్చుకోవడానికి తన వంతు కృషి చేసుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు సన్నిహితుడుగా కొనసాగగలిగారు.

✍️ఈ దశలో తెలంగాణ రాష్ట్రం వాస్తవ రూపం దాల్చడం, 2014లో జరిగిన ఎన్నికలలో మరోసారి కొడంగల్ నుంచి గెలుపొందడం వల్ల  కూడా ఈయన ఇమేజీ పెరిగింది. ఆ టైమ్ లో టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో గొడవ పడుతుండేవారు. 2014లో మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీచేయాలని రేవంత్ అనుకున్నారు. పలు కాలేజీల యజమాని మల్లారెడ్డికి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడం కొంత కోపం తెప్పించింది. మల్లారెడ్డి పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చి టీడీపీ టిక్కెట్ పొందారని రేవంత్ ఆరోపించారు. ఆ తర్వాత కాలంలో  రేవంత్‌కు కూడా డబ్బిచ్చానని మల్లారెడ్డి చెప్పడం విశేషం.

✍️2014లో ఎంపీ టిక్కెట్ రాకపోవడంతో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడమే ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం, కొన్నిసార్లు దూషణలకు దిగడం ద్వారా తాను కేసీఆర్‌ను ఎదిరించగలనని ఒక ముద్ర వేసుకున్నారు. అదే టైమ్‌లో తెలంగాణ టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడుగా కూడా నియమితులయ్యారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అవకాశం వచ్చింది. ఆ టైమ్‌లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. తెలంగాణపై కూడా పట్టు సాధించాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతుండేవారు. కేసీఆర్‌ను అవమానిస్తూ మాట్లాడేవారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు లావాదేవీకి సంబంధించి రేవంత్‌ను చంద్రబాబు ప్రయోగించడం, ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన ఈయనను పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకోవడం పెద్ద సంచలనం అయింది. రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.

✍️చంద్రబాబు హైదరాబాద్ వదలి విజయవాడకు వెళ్లిపోయి కేసీఆర్‌తో రాజీపడ్డారు. అయితే రేవంత్ ఎక్కడా చంద్రబాబును బుక్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. దానికి కృతజ్ఞతగా రేవంత్ ఆర్ధిక అవసరాలను చంద్రబాబు చూసుకున్నారని చెబుతారు. ఎర్రబెల్లి దయాకరరావు ఆ సమాచారం లీక్ చేయడం వల్లే తాను ఇరుక్కున్నానని రేవంత్ చెబుతుంటారు.   ఆ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు పన్నెండు మంది వరసగా టీఆర్ఎస్‌లో  చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ   పరిస్థితి అయోమయంగా మారడంతో చంద్రబాబు సూచన మేరకు రేవంత్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. బహుశా చంద్రబాబుకు అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వంతో సత్సంబంధాలు ఉండడం కూడా ఈయనకు ఉపయోగపడింది.

✍️రేవంత్ కాంగ్రెస్  వర్కింగ్ అధ్యక్షుడు అయ్యారు. తదుపరి కేసీఆర్‌పై తానే గట్టిగా పోరాడగలనని పలుమార్లు రుజువు చేసుకునే యత్నం చేసేవారు. శాసనసభలో కూడా అదే రీతిలో వ్యవహరించి సస్పెండ్ అయ్యేవారు. వీటన్నిటిని గమనించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈయనకే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. తొలుత పలువురు సీనియర్లు ఈ నియామకాన్ని వ్యతిరేకించినా, ఎన్నికలలో గెలుపు అవసరం రీత్యా సర్దుకుపోక తప్పలేదు. రేవంత్  ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారం సేకరించడం లో దిట్టగా పేరొందారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌లకు ఒక్కో రిటైర్డ్ ఉద్యోగిని నియమించుకుని సమాచారం సంపాదిస్తుంటారని చెబుతారు. ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. ఈ విషయంలో ఆయనపై కూడా ప్రభుత్వం కొన్ని కబ్జా ఆరోపణలు చేసేది.

✍️2018 లో శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం మైనస్ అయినా, ఆ తర్వాత మల్కాజిగిరి టిక్కెట్ సాధించుకుని స్వల్ప మెజార్టీతో గెలుపొందడం ఆయనకు రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి, తద్వారా పీసీసీ అధ్యక్షుడు అవడానికి ఈ  ఎంపి పదవి దోహదపడింది. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన వ్యవహార శైలిపై కొందరికి అభ్యంతరం ఉన్నా, ఇష్టం లేని వారు పార్టీ వీడడం తప్ప, గొడవ చేసే పరిస్థితి లేకుండా జాగ్రత్తపడ్డారు. కోమటిరెడ్డి సోదరులు ఆయనకు వ్యతిరేకంగా ఇబ్బందిపెట్టే యత్నం చేసేవారు.

✍️అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ను వదలి బీజేపీలోకి వెళ్లడంతో వారి ప్రభ తగ్గి, ఈయనకు ఎదురు లేకుండా పోయింది. చివరికి రాజగోపాలరెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అందుకు ఈయన అడ్డుపడలేదు. తెలుగుదేశంకు చెందిన పలువురు నేతలను ఆయన కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చారు. రేవంత్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టానికి చేరుకున్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో ముందు వరసలో ఉంటారు. కాంగ్రెస్ అధికారం రాకపోయినా, పార్టీలో ఒక ముఖ్యమైన నేతగా కొనసాగుతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల స్టేట్‌మెంట్‌లకు ప్రతిగా గట్టి కౌంటర్‌లు ఇవ్వడంలో నేర్పరే. అయితే ఒకసారి వ్యవసాయానికి మూడు గంటల నిరంతర కరెంటు ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా చేసుకునే యత్నం చేస్తోంది.

✍️ఓటుకు నోటు కేసు గురించి కేసీఆర్ ప్రస్తావిస్తే, దానికి ప్రతిగా కేసీఆర్ పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న విషయాన్ని చెప్పి సమర్ధమైన సమాధానమే ఇచ్చారని అనుకోవాలి. కొన్నిసార్లు రేవంత్ వాడే భాషపై విమర్శలు వస్తుంటాయి. అయినా అదే  పాజిటివ్ అని ఆయన మద్దతుదారులు అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇప్పటికీ కొనసాగుతుండడం ఆయనకు బలంగా ఉంది. అదే ఆయనకు బలహీనతగా కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఎన్నికలలో పోటీ చేయకపోవడంలోని లక్ష్యం కాంగ్రెస్ కు, తద్వారా రేవంత్ కు మేలు కలిగించాలనే అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కాని చంద్రబాబు అంటే ఇష్టపడనివారు కాంగ్రెస్‌కు దూరం అయ్యే ప్రమాదం కూడా తెచ్చుకున్నట్లయింది. ఏది ఏమైనా రేవంత్ ఒక చిన్న రాజకీయవేత్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా  ఎదగడం వ్యక్తిగా ఆయనకు విజయమే. కాని అసలు పరీక్ష ఈ ఎన్నికలే. ఇందులో సఫలం అవుతారా? లేదా? అన్నది మరికొద్ది రోజులలో తేలిపోతుంది.


::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top