సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి.. గత రెండేళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలును గాలికొదిలేసి.. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3.50 లక్షల కోట్ల అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడమే కాకుండా.. ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ, మెగా డీఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ భూముల దోపిడీ, ఉద్యోగుల వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలతో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా గాడి తప్పించారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ ఈ మోసపూరిత వైఖరిని, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు రాజీలేని నిరసన పోరాటాలు చేపడుతుందని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..
ప్రజాస్వామ్యం కాదు.. ఇది 'పొలిటికల్ గవర్నెన్స్'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినట్లుగా రాష్ట్రంలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదని, కేవలం తమ కార్యకర్తల ప్రయోజనాల కోసమే నడిచే ‘పొలిటికల్ గవర్నెన్స్’ మాత్రమే. "ప్రజాస్వామ్యం అంటే మేం ముగ్గురమే.. మేం చెప్పిందే నడవాలి" అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్త వస్తే ప్రభుత్వ అధికారి కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి పనులు చేసి పెట్టాలని మంత్రి అచ్చన్నాయుడు బహిరంగంగా ఆదేశించడం చూస్తుంటే రాష్ట్రంలో వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థమవుతోంది.
కూటమి హామీల అమలు శూన్యం..
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. వాటికి అదనంగా మరిన్ని పథకాలు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, నేడు అసలు పథకాలకే ఎసరు పెట్టారు. ఈ నేపథ్యంలో కూటమి మోసాలపై వైఎస్ జగన్ పిలుపునిచ్చిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు, నాలుగు కూడళ్లలో బ్యాండు పేపర్ల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో విఫల నాయకుడు
ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక్కడ సమాధానం చెప్పలేక రాష్ట్ర సరిహద్దులు దాటి మరో సమస్యలో చిక్కుకుని అందరితో తిట్లు తింటున్నారు. "పవన్ కళ్యాణ్.. మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ ప్రజా జీవితంలో మీరు పూర్తిగా విఫల నాయకుడు. నాడు ప్రశ్నిస్తానన్న నాయకుడు నేడెక్కడ దాక్కున్నాడు?". కనీసం సీఎం కూడా కాలేని వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ ఎందుకు?.
డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి..
వైఎస్సార్సీపీ ప్రజల తరపున నిలదీస్తుంటే.. కూటమి నేతలు సమాధానం చెప్పలేక వైఎస్సార్సీపీపై ‘గొడ్డలి పార్టీ’, ‘క్రిమినల్స్ పార్టీ’ అంటూ బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఉదయం లేచింది మొదలు వైఎస్ జగన్ పేరు తలచుకోకుండా కూటమి నేతలకు రోజు గడవడం లేదు. పేదలపై ప్రేమ ఒలకబోసే చంద్రబాబు.. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ కేటాయించిన 50 వేల ఇళ్ల స్థలాలను ‘డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్’ (జనాభా సమతుల్యత దెబ్బతింటుంది) అనే సాకుతో రద్దు చేయడం సిగ్గుచేటు. ఈ అన్యాయాలపై భాగస్వామ్య పార్టీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలి.
అస్తవ్యస్త పాలన.. అక్రమాలమయం..
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది, చివరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలే సొంత ప్రభుత్వంపై అడ్డం తిరిగే పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు రావాల్సిన అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, స్పోర్ట్స్ కోటా పేరిట పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని, బాధితులంతా వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు కోరగా.. వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచింది. నాడు వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను రక్షిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 12 కీలక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి భక్షించే కార్యక్రమానికి తెరలేపింది.
99 పైసలకే భూములు:
ఏ ప్రభుత్వమైనా 99 పైసలకే ఎకరా భూమిని అమ్ముతుందా? పెట్టుబడిదారుల పేరుతో ప్రభుత్వ భూములను, పేదల అసైన్డ్ భూములను తమ అనుయాయులకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. అమరావతి నిర్మాణం అనేది అంతులేని కథగా మారిందని, గాలిలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో చారిత్రాత్మక భూసర్వే చేపడితే విషప్రచారం చేసిన కూటమి నేతలు, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ వైయస్సార్సీపీ చేసిన అభివృద్ధి పనులకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు.
మహిళలపై అఘాయిత్యాలు..
కూటమి ఎమ్మెల్యేలు కీచకుల్లా మారి వరుసగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. అలాగే, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఆ డబ్బు అంతా ఎటు పోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి చేసిన అక్రమ అప్పులపై ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.
విద్యా, వైద్య రంగాలు ధ్వంసం.. ఉద్యోగులపై వేధింపులు..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సూది, దూది, మందులు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి నెలకొంది. వైయస్.జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూశారు, అయితే వైయస్సార్సీపీ పోరాటానికి భయపడి ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధులు నిలిపివేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ హక్కులైన డీఏ, ప్రమోషన్స్, ఐఆర్ అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
రైతుల అరెస్టులు దుర్మార్గం..
రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లపైకి వస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హతను కూటమి ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది, కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమ అరెస్టులపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుంది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి.
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం:
"ఎన్నికల నాడు రంగురంగుల బ్యాండు పేపర్లు (మేనిఫెస్టో) చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజల వీపున పొడిచిన ఈ పొలిటికల్ వెన్నుపోటును జనాల్లోకి బలంగా తీసుకెళ్తాం. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగే మా ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు రైతులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తాం" అని జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కూటమి పాలకుల ప్రతి అక్రమంపై వైఎస్సార్సీపీ భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ జరిపించి తీరుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అరెస్టులు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా కూటమి మెడలు వంచే వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని జూపూడి ప్రభాకరరావు అన్నారు.


