చిత్రకళా వీధితో కళాకారులకు ప్రయోజనం లేదు.. | - | Sakshi
Sakshi News home page

చిత్రకళా వీధితో కళాకారులకు ప్రయోజనం లేదు..

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

చిత్రకళా వీధితో కళాకారులకు ప్రయోజనం లేదు..

రహదారులను మూసేసి రోడ్లపై చిత్రకళలు అవసరమా!

ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నా ప్రధాన రహదారులే ఎందుకని:

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు నిలదీత

గుంటూరు ఎడ్యుకేషన్‌: అమరావతి చిత్రకళా వీధి పేరుతో రోడ్లనే మూసేసి కార్యక్రమాలను నిర్వహించడం వలన కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మినహా, ప్రజలకు, కళాకారులకు ఎటువంటి ప్రయోజనం లేదని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు సిద్ద వెంకాయమ్మ అన్నారు. ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమవేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్‌ బూసి రాజులత, జిల్లా మహిళా విభాగ నాయకులు సూదా తులసి కుమారి, ఇంటూరి శశికళ, వజ్రాల విజయ, మలిరెడ్డి కల్పన రెడ్డితో కలసి వారు మాట్లాడుతూ చిత్రకళా వీధి కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకం కాదని, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను ఎంచుకోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నగరంలో ఎన్టీఆర్‌ స్టేడియం, బీఆర్‌ స్టేడియం, చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుంటూరు గ్రౌండ్‌ వంటి ప్రజాదరణ పొందిన, కార్యక్రమాలకు అనుకూలమైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నప్పటికీ రహదారులనే కార్యక్రమం కోసం ఎంచుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు? శంకర్‌విలాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధాన రహదారులను మూసివేయడం వలన ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగిందని అన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారిని మూసి వేసి, స్టాళ్లను, వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు గుజ్జనగుండ్ల నుంచి కొరిటెపాడు వరకు ప్రధాన రహధారిలోకి వచ్చే మిగిలిన రోడ్లను మూసి వేయడం వలన ప్రజలు తీవ్రు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రధాన రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆ మార్గంపై ఆధారపడి చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని గడుపుతున్న చిరు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, దుకాణాలు, తాత్కాలిక స్టాల్స్‌ ఏర్పాటు చేసుకుని రోజువారీ ఆదాయంపై ఆధారపడే వారు రహదారి మూసివేతతో తమ జీవన విధానాన్ని కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ వేదికలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటో అధికారులు ప్రజలకు స్పష్టంచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement