న్యూస్‌రీల్
80 ఏళ్ల వైద్య చరిత్రలో తొలిసారి 50వ ర్యాంకు రూ.10 కోట్లతో వైద్య కళాశాల ఆధునికీకరణ దాతల సాయంతో పలు అధునాతన వసతులు
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మకు ఆదివారం లక్ష పసుపు కొమ్ములతో విశేష అర్చన, అలంకరణ చేశారు. భక్తులు బోనాలు, పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
నగరంపాలెం: నృత్యం మనోవికాసానికి దోహదపడుతుందని ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు అన్నారు. గుంటూరు బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నృత్యాలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో నృత్య కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురామ్ నిర్వహణలో వేడుకలు జరిగాయి. అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన నాట్య మయూర శిష్య బృందం ప్రదర్శించిన ‘ఇల వైకుంఠం’ కూచిపూడి నృత్య కీర్తనలకు మద్దాళి సౌందర్య నృత్య దర్శకత్వం వహించారు. నాట్యాచార్యులు ఎస్‌కే.ఖలీల్ రాధామాధవ నాట్యక్షేత్రం శిష్య బృందం ‘అచ్యుతం– కేశవం’ రాధాకృష్ణుల బృంద నాట్యం ప్రదర్శించారు. నృత్య కిన్నెర యాభై ఏళ్ల ప్రస్థానంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి అభినందించారు. సభలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ప్రభాకరరావు, నిర్వాహకులు పి.విజయకుమార్, కోశాధికారి కేవీ సుబ్బారావు పాల్గొన్నారు. అతిథులను, కళాకారులను సత్కరించారు.
ఇంద్రకీలాద్రిపై రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. వందకుపైగా భక్త బృందాలు సారె సమర్పించాయి.
గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి దాతల సాయం మరువలేనిది. వైద్య కళాశాలను దేశంలో టాప్ పది కళాశాలల్లో నిలబెట్టడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పూర్వ వైద్య విద్యార్థులు, నగరానికి చెందిన ప్రముఖులు విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బోధనలోనూ, వసతుల్లోనూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతా. నేను ఇక్కడే చదువుకున్నాను. మాతృ సంస్థకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 50వ ర్యాంక్ రావడం మాటల్లో చెప్పలేని అనుభూతిని మిగిల్చింది.
– డాక్టర్ ఎన్‌వీ సుందరాచారి,
ప్రిన్సిపాల్, జీఎంసీ
గుంటూరు మెడికల్: దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య కళాశాలలకు ర్యాంకింగ్స్ అందజేసే ప్రతిష్ఠాత్మక ఐఐఆర్‌ఎఫ్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్స్–2026ను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 144 వైద్య కళాశాలలకు ర్యాంకింగ్స్ ప్రకటించగా, ఫలితాల్లో గుంటూరు మెడికల్ కాలేజ్‌కు జాతీయ స్థాయిలో 50వ స్థానం లభించింది. గుంటూరు వైద్య కళాశాల 1946లో ప్రారంభమైంది. ర్యాంకింగ్స్ అందజేసేందుకు నిర్దేశించిన ప్రమాణాల పరీక్షల్లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 953 మార్కులతో దేశ వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవగా, గుంటూరు వైద్య కళాశాలకు 920 మార్కులు వచ్చాయి.
రూ.10 కోట్లతో రూపురేఖలు మార్చి...
గుంటూరు వైద్య కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.10 కోట్లతో దాతల సాయంతో వైద్య కళాశాలను అభివృద్ధి చేసి, రాష్ట్రం అంతటా గుంటూరు వైద్య కళాశాల గురించి చర్చించుకునేలా రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు. గుంటూరు వైద్య కళాశాల 1999 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్రులు రూ.80 లక్షల విరాళంతో రెండు బస్సులు అందించారు. హాస్టళ్లలో క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, వైద్య విద్యతోపాటు విద్యార్థుల్లో క్రీడల్లో రాణించేలా చొరవ చూపించారు. కళాశాల లోపలి రోడ్లను 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ నలమోతు శరత్‌చంద్రకుమార్ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం ఇచ్చిన రూ.6 లక్షల విరాళంతో నిర్మించారు. కళాశాల ప్రధాన ద్వారాన్ని పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ చెరుకూరి పవన్‌కుమార్ ఇచ్చిన రూ.7 లక్షలతో నిర్మించారు. ప్రముఖ స్పైన్ సర్జన్, గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ జె. నరేష్‌బాబు కుటుంబం రూ.25 లక్షలు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి రూ.10 లక్షలు, డాక్టర్ శారద రూ.6 లక్షల విరాళం ఇవ్వడంతో కళాశాలలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 1980 బ్యాచ్ విద్యార్థులు రూ.60 లక్షలు విరాళం ఇవ్వడంతో పలు లెక్చర్ గ్యాలరీలను ఆధునికీకరించారు. రూ.10 లక్షలతో ఎగ్జామినేషన్ హాలు ఏర్పాటు చేశారు. వాటర్ కూలర్లు, పలు విభాగాల ఆధునికీకరణ పనులకు పలువురు దాతలు సహకరించారు. కళాశాలలో పలు వైద్య విభాగాలను ఆధునీకరించారు. విద్యుత్ వ్యవస్థ మెరుగుదల, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు, చెట్ల సంరక్షణ, గెస్ట్ ఫ్యాకల్టీ భవనం ఆధునికీకరణ, లైబ్రరీ ఆధునికీకరణ, విగ్రహాలతో పాటు ఫౌంటెన్ల అభివృద్ధి, వైద్య విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రత్యేక వెల్‌నెస్ క్లినిక్‌ను ఏర్పాటు వంటివి చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులు సైతం మెచ్చుకునేలా గుంటూరు వైద్య కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రిన్సిపల్ ప్రత్యేక కృషి
‘గుంటూరు వైద్య కళాశాలను దేశంలోని టాప్ 100 కళాశాలల్లో ఒకటిగా నిలుపుతాను’ అని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి బాధ్యతలు చేపట్టిన 2024 నవంబర్ 1న మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే నేడు గుంటూరు వైద్య కళాశాలను దేశంలోనే 50వ స్థానంలో నిలిపి అందరి మన్ననలు పొందారు. దక్షిణ భారతదేశంలోని వైద్య కళాశాలల్లో 10వ స్థానంలో, ఏపీలోని మెడికల్ కాలేజీల్లో మూడో స్థానంలో కళాశాలను నిలిపి రికార్డు సృష్టించారు. ఉత్తమ బోధనకు 2023లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 2022లో ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీగా డాక్టర్ సుందరాచారి ఎంపికయ్యారు.
స్టాల్స్ వద్ద సందర్శకులు


