
బీహార్‌లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీహిర్‌లో మళ్లీ సర్‌ను నిర్వహించాలని పట్టుబబుతోంది.
ఈసీ ఏర్పాటు చేసిన సర్‌కు కాంగ్రెస్ 89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని బీహార్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో లక్షల్లో ఫిర్యాదులు ఇస్తే దానిని సర్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు కాబట్టే వాటిని వారు తీసుకోలేదన్నారాయన. దాంతో సర్‌ను కచ్చితంగా బీహార్‌లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లో ఇప్పటికే 60లక్షలకు పైగా ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై ఈసీపై సైతం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. కేంద్రంతో కలిసి ఈసీ చేస్తున్న ఓట్ చోరీ అంటూ ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా ఆగస్టు 17వ తేదీన బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా ససారామ్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ యాత్రకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ యాత్ర తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ(సోమవారం) నుంచి పాట్నాలో ప్రారంభం కానుంది.