ఆపరేషన్ లోటస్ వేళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పైనే బీజేపీ ఎదురు దాడికి దిగింది. కొత్త బంగ్లాకు ఆయన మకాం మార్చడంపై సెటైర్లు వేసింది. తనది సాదాసీదా జీవనం అని చెప్పుకునే కేజ్రీవాల్.. ఛండీగఢ్ బంగ్లా కోసం మాత్రం కోట్లు ఖర్చు చేశారని, అదంతా ప్రజా ధనమేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో ఇటు కేజ్రీవాల్‌కు బంగ్లా విషయంలో జరిగిన వెన్నుపోటు కూడా చర్చనీయాంశమైంది.
లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బయటకు వచ్చాక సీఎం పదవికి రాజీనామా చేయడంతో అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆనాడు ఆప్(ప్రస్తుత బీజేపీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రముఖ విద్యావేత్త అశోక్ మిట్టల్ కేజ్రీవాల్ కుటుంబాన్ని తన అధికారిక బంగ్లాకు ఆహ్వానించారు. మండీ హౌస్ సమీపంలోని 5 ఫిరోజ్‌షా రోడ్‌లోని బంగ్లాలో అప్పటి నుంచి ఆ కుటుంబం ఉంటూ వస్తోంది. అయితే నిన్న(ఏప్రిల్ 24)న లోధీ ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాలోకి మారాడు. ఇది కాకుండా ఛండీగఢ్ సెక్టార్‌లో కేజ్రీవాల్ మరో ప్రభుత్వ బంగ్లాను ఆక్రమించారని.. దానిని షీష్ మహల్ 2 అంటూ ఎగతాళి చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ.
కేజ్రీవాల్‌ను ఢిల్లీ రెహమాన్ డెకాయిత్‌గా (ధురంధర్ సినిమాలోని ఫేమస్ పాత్ర.. ) అభివర్ణిస్తూ శనివారం పర్వేశ్‌వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కేజ్రీవాల్ ఒకప్పుడు తనది సాధారణ జీవనం అని చెప్పి ప్రజల మద్దతు పొందారు. ఇప్పుడు విలాసవంతమైన బంగ్లాకు మారడం ఆయన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఆ బంగ్లాను అంత లగ్జరీగా మార్చడానికి డబ్బుల్లేక్కడివి?. అదంతా పంజాబ్ ప్రజల సొమ్ము కదా?.. ఈ విషయంలో దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలి’’ అని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ క్రమంలో బంగ్లా లోపల అంటూ కొన్ని ఫొటోలను ప్రదర్శించి ‘షీష్ మహల్-2’ అంటూ ఆరోపించారు.
#WATCH | दिल्ली: दिल्ली सरकार में मंत्री प्रवेश वर्मा ने कहा, "यह उनके पूरे घर का लेआउट है... जितना दिमाग उन्होंने एक-एक कमरों पर लगाया है, अगर उतना समय वे दिल्ली के कार्यों में लगाते तो शायद आज उनके कार्यकर्ता आम आदमी पार्टी को छोड़कर नहीं जा रहे होते।" pic.twitter.com/dr3ZC0hA0T
— ANI_HindiNews (@AHindinews) April 25, 2026
నమ్మకస్తుడి వెన్నుపోటు
అశోక్ మిట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) స్థాపకుడు, ఛాన్సలర్ కూడా. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ ఆయన్ని రాజ్యసభకు పంపింది. ఈ నెల మొదట్లో రాఘవ్ చద్దా తీరుతో విసిగిపోయిన ఆప్.. ఆయన్ని తప్పించి అశోక్ మిట్టల్‌ను రాజ్యసభ ఉపనేతగా నియమించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే అశోక్ విద్యాసంస్థలపై ఈడీ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఆప్ ఆ దాడులను ప్రతీకార రాజకీయంగా ఖండించింది. అయితే..

ఏడాది పాటు కేజ్రీవాల్‌ను తన ఇంట్లో ఉంచుకున్న అశోక్ మిట్టల్.. ఆయన బంగ్లా ఖాళీ చేసిన కాసేపటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఆయనతో పాటు రాఘవ్ చద్దా, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీలో చేరారు. లోథి ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాను ప్రస్తుతం జాతీయ పార్టీ అధినేత హోదా కింద కేజ్రీవాల్‌కు కేటాయించారు. అయితే బీజేపీ మాత్రం జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతలంతా ఛండీగఢ్ సెక్టార్‌లోని ప్రభుత్వ బంగ్లాలను ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సహకారంతో ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తోంది.
2015-2024 మధ్య కేజ్రీవాల్ ఢిల్లీ సిఎంగా ఉన్నప్పుడు నివసించిన సివిల్ లైన్స్ బంగ్లాను బీజేపీ "షీష్ మహల్"గా పిలిచింది. ఈ బంగ్లాలో కోట్ల ప్రజా ధనం వెచ్చించి విలాసవంతమైన సౌకర్యాలను కేజ్రీవాల్ అనుభవించారని ఆరోపించింది. ఇప్పుడు ఆయన వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ ఎన్నికల కోసం ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో షీష్ మహల్2ను తెరపైకి తెచ్చింది.


