తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి డీఎంకే తరఫున ఉదయనిధి స్టాలిన్.. విజయ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత డీఎంకే ప్రభుత్వ పథకాలనే కొత్తగా తమవిగా విజయ్ ప్రచారం చేసుకుంటున్నారని ఉదయనిధి ఆరోపించారు. మహిళా హక్కుల భృతి, పాఠశాల అల్పాహార పథకం.. ఈ పథకాలు డీఎంకే హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిపై కొత్త ప్రభుత్వం స్టిక్కర్ అతికించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు. కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినీ పవర్ కట్‌ల నుంచి భారీ విద్యుత్ అంతరాయాల వరకు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. "అన్నా వస్తే పవర్ వస్తుంది అన్నారు.. ఇప్పుడు తమిళనాడుకే పవర్ పోయింది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మహిళల భద్రత అంశంపైనా ఉదయనిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే 200కు పైగా లైంగిక నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. "మహిళలపై జరుగుతున్న నేరాలు చూస్తుంటే మనం తమిళనాడులో ఉన్నామా? లేదంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే సభలో అత్యంత చర్చనీయాంశంగా మారింది మాత్రం.. సీఎం విజయ్‌పై ఆయన చేసిన వ్యక్తిగత, రాజకీయ విమర్శలే. "అసెంబ్లీని సినిమా హాల్‌లా మార్చేశారు. సభలో కూడా నటించడం మొదలుపెట్టారు" అంటూ ఉదయనిధి ఎద్దేవా చేశారు. విజయ్ ప్రసంగాన్ని ఉద్దేశించి.. "విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారు.. మళ్లీ యాక్షన్ చెప్పగానే మొదలుపెడుతున్నారు" అని ఉదయ్‌నిధి వ్యాఖ్యానించారు.
అంతేకాదు, "రేపటి నుంచి విజయ్ అసెంబ్లీకి క్యార్‌వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికే అసెంబ్లీని వాడుకుంటున్నారు. రీల్స్ చేసుకోవడానికే వస్తున్నారా? పాలనపై బాధ్యత లేదా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. సభలో విజిల్స్ వేయడం కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యేలతో ఐటెం సాంగ్స్‌కు డ్యాన్సులు చేయిస్తారేమో అంటూ ఉదయ్‌నిధి, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు సీఎం విజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు కొనసాగుతాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. "మాది యాక్టర్ పార్టీ అని ఎగతాళి చేశారు. కానీ ప్రజల మధ్య నుంచే వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాం" అంటూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.
అయితే.. ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అధవ్ అర్జున్.. పార్టీ పేరు కూడా చెప్పకుండానే కొందరు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి జరిగి ఉంటే ఆ డబ్బంతా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారాయి. సీఎం విజయ్ విమర్శలు.. ఉదయనిధి చేసిన ప్రతివిమర్శలు.. వాటికి అధికార పక్షం ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


