పార్వతీపురం: జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్‌లో ఏదో ఒక కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృహాల్లో కేటాయించిన సీట్లను వందశాతం భర్తీ చేయాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేయని యువత, ఉద్యోగులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మార్ట్ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో ప్రతీ రోజు శిక్షణలు నిర్వహించాలని, పంట బీమా శాతం వందకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాలూరులో మిలెట్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు, వేలాది మంది రైతులకు ఉపాధి, ఆదాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. జీడి తోటల్లో అంతర్ పంటలు, పాఠశాలల్లో నర్సరీలు, చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పౌష్టికాహార లోపంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పురోగతిపై జూమ్ సమావేశంలో సమీక్ష నిర్వహించిన ఆయన అంగన్వాడీ సేవలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓలు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.


