జిల్లాలో తొలిసారిగా వరి, చేపల మిశ్రమ పెంపకం ప్రారంభం రైతులకు తక్కువ నీటితో అధిక ఆదాయం అధిక ఆదాయమే లక్ష్యంగా వరితో పాటు చేపల పెంపకం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
వీరఘట్టం: ఎల్‌నినో పరిస్ధితులను ఎదుర్కొంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ డా. ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలం తలవరం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వరి, చేపల మిశ్రమ పెంపకం కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి పొలంలో దాదాపు 350 చేప పిల్లలను కలెక్టర్ తన చేతుల మీదుగా వదిలి, వినూత్న కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో, ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయాల్లోనూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడానికి ఈ సమగ్ర వ్యవసాయ నమూనా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకే వనరు నుంచి అటు వరి పంటను, ఇటు చేపల దిగుబడిని పొందవచ్చునని ఇది రైతులకు ఆర్థికంగా మంచి వెసులబాటు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రారంభించిన మోడల్ కార్యక్రమం రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర ప్రాంతాల రైతులు కూడా దీనిని స్ఫూరిగా తీసుకోవాలని సూచించారు. ఈ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో సాగులో ఉన్న వరి పంటను పరిశీలించారు. చీడ, పీడల నివారణ కోసం పంటలో పిచికారీ చేస్తున్న జీవామృతాల తయారీ విధానాన్ని ఏఓ జె.సౌజన్య వివరించారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో గట్టు మీద చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పొలం గట్టుపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్, జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీశంకర్, జిల్లా మత్య్సశాఖ అధికారి టి.సంతోష్‌కుమార్, ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం ఎం.షణ్ముఖనాయుడు, తహసీల్దార్ వి.రాజేశ్వరరావు, ఎంపీడీఓ బి.వెంకటరమణ, సబివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


