సంస్కృతికి ప్రతిబింబంగా ‘ఆదివాసీ దినోత్సవం’ | - | Sakshi
Sakshi News home page

సంస్కృతికి ప్రతిబింబంగా ‘ఆదివాసీ దినోత్సవం’

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

సంస్కృతికి ప్రతిబింబంగా ‘ఆదివాసీ దినోత్సవం’ ● అట్టహాసంగా వేడుకల నిర్వహణకు ఐటీడీఏ పీఓ పిలుపు

పార్వతీపురం రూరల్‌ : గిరిజన హక్కుల పరిరక్షణ, వారి విలక్షణ సంస్కృతీ సాంప్రదాయాలను సమున్నతంగా చాటిచెప్పేలా జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) ఆర్‌.వైశాలి పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ ఆవరణలోని ‘గిరిమిత్ర’ హాల్‌లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 9న ఉత్సవాలు జరగనుండగా, జిల్లా స్థాయిలో ఆగస్టు 8నే మిన్నంటేలా నిర్వహించేందుకు అధికారులు, గిరిజన సంఘాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధితో పాటు వారి ఉనికిని, ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పీఓ పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. గిరిజన వైభవాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement