ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : సబ్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : సబ్‌ కలెక్టర్‌

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహిద్దామని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై గిరిజన సంఘాల నాయకులతో మంగళవారం ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆహార కమిటీ, ఆహ్వాన కమిటీ, సాంస్కృతిక కమిటీ తదితర కమిటీలను నియమించనున్నట్టు తెలిపారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆదివాసీ దినోత్సవం ఒక వేదిక అన్నారు. వేడుకల నిర్వహణలో గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు, యువత, మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న గిరిజన జేఏసీ నాయకులు ఉత్సవాల నిర్వహాణపై పలు సలహాలు సూచనలిచ్చారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, ఆదివాసీ జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్‌రావు, ఎం.రవికుమార్‌, ఎన్‌.కాంతారావు, జె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

‘దివిసీమ గాంధీ’ మండలికి పోలీసుల నివాళి

పార్వతీపురం రూరల్‌ : ‘దివిసీమ గాంధీ’గా గుర్తింపు పొందిన మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి, ఇతర అధికారులు మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, విద్యా వికాసం, తెలుగు భాషా పరిరక్షణకు మండలి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దివిసీమలోని నిరుపేదలకు వేలాది ఎకరాల బంజరు భూములను పంపిణీ చేసిన ఆయన జీవితం, సేవాభావం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఏఏఓ బాలరాజు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

పార్వతీపురం రూరల్‌: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిందని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతల చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 20 వరకు హెల్ప్‌డెస్క్‌లో ధ్రువపత్రాల పరిశీలన, 12, 13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 20న ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పించారు. ఆగస్టు 26న సీట్ల కేటాయింపు ఉంటుందని, 27 నుంచి 29వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో చేరా లని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతిగృహం, డిజిటల్‌ తరగతులు, గ్రంథాలయం, ల్యాబ్‌లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రవేశాలు, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

పాలకొండలో భారీ వర్షం

పాలకొండ రూరల్‌: మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు.. సాగులో వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు పాలకొండలో మంగళవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉరుములు, మెరుపులతో సుమారు 40 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో రైతులు ఊరట చెందారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వర్షంతో రైతులు పొలం బాట పట్టారు. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement