న్యూస్‌రీల్
ఈ పంటలకు మార్కెట్ ఎక్కడ?
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మసకబారిన
వెలుగు మార్కెటింగ్ కేంద్రాలు చీకటి మయమవుతున్నాయి. వన్‌ధన్ వికాసకేంద్రాలు ఇప్పటికే మూలకు చేరాయి. దీంతో గిరిజనుల ఆదాయవనరులు సన్నగిల్లుతున్నాయి. ఒక్కో గిరిజన కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం మాట అటుంచితే ఇప్పటికే దళారీ వ్యాపారుల మాయలో పడి నష్టపోతున్నారు. ఇటు జీసీసీ వంటి సంస్థలు ఉన్నా నామమాత్రంగానే పనిచేస్తున్నాయి.
సీతంపేట: గిరిజన ప్రధాన ఆదాయ వనరులు చింతపండు, జీడి, పైనాపిల్, పసుపు, కంది పంటలు. వాటిని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేది ఐటీడీఏ ఆశయం. వెలుగు ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నెలకొల్పి తద్వారా ఆదాయ వనరులు మహిళా సంఘాలకు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం వన్‌ధన్ వికాస కేంద్రాలు (వీడీవీకే)ల పేరుతో ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పి ఉత్పత్తులను మార్కెట్ చేయాలనేది ఉద్దేశం. ఐటీడీఏ పరిధిలో సుమారు 12వేల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను పది చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కో యూనిట్‌కు ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక మూతపడ్డాయి. జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను శంభాం, జిల్లేడుపాడు, సీతంపేటలలో ఏర్పాటు చేశారు. వాటికి కూడా భారీ యంత్రాలను సమకూర్చారు. మహిళా సంఘాలు ప్రాసెస్ చేసి జీడిపిక్కలు తీసి ప్యాకెట్‌ల రూపంలో తయారు చేసినా సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆయా కేంద్రాలు తెరుచుకోలేదు. సీజన్‌లో చింతపండు కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి నాణ్యమైన చింతపండును పిక్కతీసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి వసతిగృహాలు, ఇతర మార్కెటింగ్ కేంద్రాలకు విక్రయించాలనేది ఉద్దేశం. ఈ యూనిట్‌ను సీతంపేటలో ఏర్పాటు చేసినా అదికూడా పనిచేయడం లేదు. స్థానికంగా ఐటీడీఏ సమీపంలో ఈ కేంద్రాలు నెలకొల్పినప్పటికీ దిబ్బగూడలో నెలకొల్సిన పసుపు ప్రాసెస్ యూనిట్ తప్ప మరేమీ నడవడం లేదు. వాటిన్నింటికీ సుమారు రూ. కోటి వరకు వెచ్చించినా నిధుల వృథా తప్ప ప్రయోజనం లేదని గిరిజనులు పెదవివిరుస్తున్నారు.
వెలుగు అదికారుల సరైన పర్యవేక్షణ లేదు. ఈ మార్కెటింగ్ కేంద్రాలపై దృష్టిసారించాలని సంబంధిత వెలుగు అధికారులకు ఎప్పటి నుంచో విన్నవిస్తున్నాం. లక్షల్లో వృథా చేశారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. గిరిజనులకు మంచి మార్కెట్ సదుపాయాలు కల్పించి ఉపాధి సౌకర్యాలు మెరుగుపర్చాలి. విశ్వాసరాయి కళావతి,
మాజీ ఎమ్మెల్యే, పాలకొండ
ఏజెన్సీలో సుమారు 15 వేల ఎకరాల్లో పైనాపిల్ పండుతుంది. దాదాపు 50 టన్నులు ఉత్పత్తి వస్తుంది. ఈ ఏడాది ధరలు లేక గిరిజన రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు బజార్లకు తీసుకువెళ్లి కొద్దిమంది మాత్రమే విక్రయాలు జరిపారు. జీడి పంట 30 వేల ఎకరాల్లో పండుతుంది. 5లక్షల కిలోల ఉత్పత్తి ఏటా జరుగుతుంది. పసుపు 5 వేల ఎకరాల్లో సాగవుతుంది. సుమారు 10 వేల కిలోల ఎండు పసుపు ఉత్పత్తి అవుతుంది. చింతపండు 5 వేల ఎకరాల్లో పండుతుంది. ఏడాదికి 100 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది.
ఇంకా ఉసిరి 200 ఎకరాల్లో పండగా 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. గిరిజనుల అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా నెలల తరబడి నిల్వ ఉంచి అనంతరం వాటిని విక్రయించుకోవడానికి వీలుగా కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాలు లేవు. గతంలో సీతంపేట వారపు సంత వద్ద రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీ పూర్తిగా పాడైంది.
మూలనపడిన వన్‌ధన్ కేంద్రాలు
రూ.కోటిపైనే వృథాగా యంత్రాలు
గిరిజనులకు మధ్య దళారులే దిక్కు
మూతపడిన జీడి ప్రాసెసింగ్ కేంద్రం


