దత్తిరాజేరు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మధుర గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేసే ప్రతిపాదనలపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు ఉన్న మధుర గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి మండల పరిషత్ అధికారులు అర్హత ఉన్న మధుర గ్రామాల ప్రజలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు.అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తీర్మానాలు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా అందిన దత్తిరాజేరు మండలంలోని గదబవలస, మర్రివలస, పోలవంగర, పాపయ్యవలస, జగన్నాథపురం, మజ్జిపేట గ్రామాల ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వానికి పంపించారు. అయితే నేటివరకు కొత్త పంచాయతీల ఏర్పాటు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో మధుర గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా పాత పంచాయతీల స్థానంలో నిర్వహిస్తారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.
కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయండి
పాపాయ్యవలసతో పాటు అర్హత ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయండి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా మాగ్రామ పంచాయతీకి జమ అవుతాయి. తద్వారా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉండడం వల్ల అధికారులు కూడా అందుబాటులో ఉంటారు.
ఎస్. శ్రీనివాసరావు, పాపయ్యవలస గ్రామం
ప్రభుత్వ ఆదేశాల మేరకే
ప్రతిపాదనలు
ప్రభుత్వ ఆదేశాల మేరకే మండలంలోని ఆరు మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు గత ఏడాది డిసెంబర్‌లో అప్పుడు ఉన్న అధికారులు పంపించారు. కొత్త పంచాయతీలు ఎప్పడు ఏర్పాటు చేస్తారన్నది ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే తెలియజేస్తాం.
ఎస్.తాత ఎంపీడీఓ దత్తిరాజేరు
కొత్త పంచాయతీలతో స్వయం ప్రతిపత్తి
అన్ని అర్హతలు ఉన్న గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైతే స్వయం ప్రతిపత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మధుర గ్రామాలు అభివృద్ధి విషయంలో చిన్నచూపుకు లోనవుతున్నాయి. అలాగే మధుర గ్రామాల ప్రజలకు గ్రామ పంచాయతీల ద్వారా అందాల్సిన పథకాల విషయంలో ఆన్నాయం జరుగుతోందనే భావన వ్యక్తమ వుతోంది. పెద్ద పంచాయతీల పరిధిలో రెండో మూడో మధుర గ్రామాలకు వచ్చే నిధులు పెద్ద పంచాయతీకే వినియోగించే అవకాశాలే అధికం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు అర్హతలు ఉన్న మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
గత ఏడాది హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం
2025 డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
6 మధుర గ్రామాలపై వీడని సందిగ్ధం


