వైజ్ఞానిక రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం
రాయగడ: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులను ప్రోత్సాహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అన్నారు. అందుకు ఇటువంటి తరహా సైన్స్ ప్రదర్శనలు దోహద పడతాయని ఆకాంక్షించారు. ఆధునిక యుగంలో అడుగులు వేస్తున్న మనం అందుకు అనుగుణంగా ముందుకు సాగాలంటే అందుకు శ్రద్ధతోపాటు ఏకాగ్రత ఎంతో అవసరమని అన్నారు. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని.. దానిని వెలుగు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, పాఠశాల ప్రధానొపాధ్యాయురాలు సునీత భొయ్, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ సూపర్‌వైజర్ దీపక్ కుమార్ బెహర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 11 సమితుల నుంచి 70 పాఠశాలలకు చెందిన 143 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.


