గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గుసాని సమితిలో లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు నాలుగు పంచాయతీల నుంచి వినతులు వెల్లువెత్తాయి. స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ (ఇన్‌చార్జి) మునీంద్ర హనగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమతి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. లావణ్యగడ, రంప, గారబంద, శోబర పంచాయతీల నుంచి మొత్తం 64 వినతులు రాగా, వాటిలో వ్యక్తిగతం 36, గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 28 ఉన్నాయి. పది మందికి వార్ధక్య, దివ్యాంగుల పింఛన్ పత్రాలు, భూ పట్టాలను జిల్లా కలెక్టర్ మునీంద్ర హనగ లబ్ధిదారులకు అందజేశారు. ఈ స్పందన కార్యక్రమానికి గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్ తహసీల్దార్ నారాయణ బెహరా, తదితరులు పాల్గొన్నారు.
కలిమెల సమితిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి చింతాలవాడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రామస్తులు అందజేసిన 82 వినతులను కలెక్టర్‌కు స్వీకరించారు. వాటిలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు అదేశించారు. అనంతరం గిరిజనులతో కలెక్టర్ చర్చించారు. గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఎస్పీ వినోద్ పటేల్, మల్కన్‌గిరి సబ్ కలెక్టర్ అశ్ని ఎ.ఎల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర సభోరో, ఇతర అధికారులు పాల్గొన్నారు.


