పనికితగ్గ వేతనం ఇవ్వాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పనిచేస్తున్న ఆశవర్కర్లు, గావ్ కళ్యాణసమితి, మహిళా ఆరోగ్య సమితి, జేఏఎస్ (జన ఆరోగ్య సమితి) వర్కర్లకు పనికి తగ్గ వేతనం రాక ఇబ్బందులుపడుతున్నారని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి అన్నారు. ఆమె స్థానిక బిజూ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లాస్థాయి ఆశ, గాకళ్యాణ సమితి, ఎం.ఏ.యస్., జె.ఎ.యస్. వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లాముఖ్యవైద్యాధికారి డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, ఆదనపు పీహెచ్‌వో డాక్టర్ రబినారాయణ దాస్, జన స్వస్థ్య అధికారి ప్రదీప్ కుమార్ మహాపాత్రో, జిల్లాపరిషత్తు ఆదనపు ఈవో ఫృధ్వీరాజ్ మండళ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ స్వస్థ్య మిషన్‌లో పనిచేస్తున్న ఆశవర్కర్లు, ఎంఏఎస్, జేఏఎస్, జీకేఎస్ వర్కర్లు ఎప్పటికై న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి జీతాలు పెంచుతారన్న ఆశాభావం వ్యక్తపరిచారు. అనంతరం ఆశ, గావ్ కళ్యాణసమితి, జన ఆరోగ్యసమితి వర్కర్లు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.


