మహానది జల వివాదంపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం
భువనేశ్వర్: మహా నది అంతర్ రాష్ట్ర జలాల పంపిణీ సమస్యలపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన మంగళ వారం జలవనరుల శాఖ రాజీవ్ భవన్‌లో జరిగింది. సమావేశానికి మంత్రులు సురేష్ కుమార్ పూజారి, పృథ్వీరాజ్ హరిచందన్, సంపద్ చంద్ర స్వంయి, ఎమ్మెల్యేలు సరోజ్ కుమార్ ప్రధాన్, నిరంజన్ పూజారి, సోఫియా ఫిర్దౌస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, జల వనరుల శాఖ సంబంధిత అధికారులు, ఇంజినీర్లు కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడానికి సమావేశంలో పాలుపంచుకున్నారు. సమావేశంలో హీరాకుద్ ప్రాజెక్ట్, మహానది జల వివాదం చారిత్రక నేపథ్యం, మహానది జల వివాదాల ట్రైబ్యునల్ ముందు జరుగుతున్న విచారణల ప్రస్తుత స్థితి, మహానది సంబంధిత సమస్యల స్నేహపూర్వక పరిష్కార ప్రక్రియ మరియు మహానది బేసిన్‌కు సంబంధించిన విషయాల సమగ్ర స్థితిపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్రం యొక్క వాదనను మరింత బలోపేతం చేయడానికి, మహా నది జల సమస్యల స్నేహపూర్వక పరిష్కారం దిశగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అంతర్ మంత్రివర్గ కమిటీ తదుపరి సమావేశాన్ని కొత్త సంవత్సరం జనవరి నెలలో నిర్వహించాలని నిర్ణయించారు.


