మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్‌ ఎద్దేవా, స్టాలిన్‌ గట్టి కౌంటర్‌ | Where's Your Father CM Jab MK Stalin In People's Hearts Retort | Sakshi
Sakshi News home page

మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్‌ ఎద్దేవా, స్టాలిన్‌ గట్టి కౌంటర్‌

Jun 25 2026 12:52 PM | Updated on Jun 25 2026 4:49 PM

Where's Your Father CM Jab MK Stalin In People's Hearts Retort

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఒక కథను చెబుతూ, మాజీ  సీఎం స్టాలిన్‌  కుమారుడు, ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ పరోక్షంగా సెటైర్ వేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేసిన   మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్, తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో టీవీకే (TVK) పార్టీ చేతిలో ఊహించని పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.  అయితే సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ  ప్రశ్నించడం, అటు ఈ రాజకీయ రగడ కాస్తా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కలకలం రేపింది.

సీఎం విజయ్ వ్యాఖ్యలపై  డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు  డీఎంకే నేతలు  ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. "నేను అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నాను. ప్రజలు నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉంటాను" అని  కౌంటర్‌  ఇచ్చారు.

డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. "మా నాయకుడిని చూసి మీ నాన్న ఎక్కడ అని అడిగారు కదా? ఆయన వస్తారు.. చాలా త్వరలోనే అసెంబ్లీలోకి అడుగు పెడతారు. మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారు" అంటూ రాబోయే ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేయబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు.

మరోవైపు సీఎం విజయ్ వ్యాఖ్యలపై కూటమి భాగస్వామి, వీసీకే (VCK) అధినేత తిరుమావళవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని హితవు పలికారు.

సీఎం విజయ్ వ్యాఖ్యలకు ప్రతిసవాల్‌గా ఉదయనిధి స్టాలిన్ ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. "చెంగల్పట్టు కోర్టులో భార్య తన భర్త కోసం వెతుకుతోంది" అంటూ విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్‌కు సంబంధించిన వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఇలా వ్యక్తిగత జీవితాలను లాగడంపై విశ్లేషకులు ఇరుపక్షాలనూ తప్పుబడుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సీఎం విజయ్ తాను గెలిచిన రెండు సీట్లలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయగా, ఐదుగురు ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఈ రాబోయే ఉప ఎన్నికలు స్టాలిన్ తిరిగి అసెంబ్లీకి రావడానికి డీఎంకేకు ఒక పెద్ద అవకాశంగా మారనున్నాయి. "మీ నాన్న ఎక్కడ?" అన్న విజయ్‌ ఎద్దేవా చేసిన  నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే ఉప ఎన్నికల ద్వారా మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
 

ఇదీ చదవండి: షాకింగ్‌ : ఆమె అలా సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement