రూల్స్‌ లేవ్‌.. ఢిల్లీలో ఇంతే: హోటల్‌ యజమాని | What owner of hotel where 21 died told police | Sakshi
Sakshi News home page

రూల్స్‌ లేవ్‌.. ఢిల్లీలో ఇంతే: హోటల్‌ యజమాని

Jun 4 2026 6:27 PM | Updated on Jun 4 2026 6:37 PM

  What owner of hotel where 21 died told police

ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2022లో 60 ఏళ్ల లవ్‌కేశ్ బజాజ్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ఇరుకైన వీధుల్లో ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి, దాన్ని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీ అండ్ బీ) సంస్థగా మార్చాలని నిర్ణయించాడు.

ఆ భవనానికి త్వరలోనే ఫ్లోరిష్ స్టేస్ బీ అండ్ బీ అనే కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత అది ఐదు అంతస్తులు, ఒక బేస్‌మెంట్‌లో 26 గదుల ప్రాంగణంగా మారింది. అయితే,  కేవలం 6 గదులకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.

బుధవారం అదే హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అతిథులు మరణించారు. వారిలో 12 మంది విదేశీయులు. అదే రాత్రి బజాజ్‌ను అరెస్టు చేశారు.

పోలీసులు ప్రశ్నించగా.. వ్యాపారం మంచి లాభాలు తెస్తుండటంతో హోటల్‌లో గదుల సంఖ్య పెంచానని, అలాగే ‘ఢిల్లీ మేన్ సబ్ చల్తా హై (ఢిల్లీలో అన్నీ చెల్లుతాయి)’ అనే భావనతో అలా చేశానని బజాజ్ చెప్పినట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో నిబంధనలు, పరిమితులు, ఆంక్షలు ఏమీ ఉండవనేలా, ఏదైనా చేసుకోవచ్చనేలా ఆ హోటల్‌ యజమాని మాట్లాడారు.  

పూర్తి సమయం హోటల్ నిర్వహణ చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో, అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించుకున్నానని కూడా బజాజ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అంశాలపై బజాజ్ భార్యను కూడా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు గదులకే అనుమతి ఉంటే 26 గదులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. అంతేగాక, ఆ ప్రాంగణం అంతటా సులభంగా మంటలు అంటుకునే అలంకరణ సామగ్రి ఉన్నట్లు తేలింది.

బుధవారం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) అధికారి మాట్లాడుతూ.. అలంకరణలో భాగంగా భవనం లోపల, బయట అనేక చెక్క, ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారని, దీంతో మంటలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని చెప్పారు.

బజాజ్ ఆ ప్రాంతంలో మరో రెండు ప్రాపర్టీలను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతా, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఇప్పుడు వాటినీ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement