లోహగడ్‌ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్ | What Happened At Lohagad: Recreate Crime Scene | Sakshi
Sakshi News home page

లోహగడ్‌ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్

Jun 28 2026 1:36 PM | Updated on Jul 3 2026 2:17 PM

What Happened At Lohagad: Recreate Crime Scene

పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్‌ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్‌ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.

పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్‌ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.

మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్‌ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్‌ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.

క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్‌ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.

కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్‌ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement