కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ | TMC Congress Merger Rumours Spark Political Buzz, Both Parties Deny Talks Amid High Profile Delhi Meetings | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ

Jun 11 2026 7:29 AM | Updated on Jun 11 2026 11:59 AM

TMC Congress Party Reacts On Merge Proposal

మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్‌ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.

గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.

ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్‌, కాంగ్రెస్‌తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.

ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్‌ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్‌గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్‌ రాయ్‌ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్‌ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.

ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్‌ వర్గం) కీలక నేత సంజయ్‌ రౌత్‌.. ఒకప్పుడు కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్‌పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.

అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్‌స్టాప్‌ పెట్టింది. కాంగ్రెస్‌తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్‌ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్‌ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.

రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement