ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌ | Starlink Row: India Rejects Musks Oligarchs Allegation | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌

Oct 8 2026 10:48 AM | Updated on Oct 8 2026 10:58 AM

Starlink Row: India Rejects Musks Oligarchs Allegation

అమెరికా బిలియనీర్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల ప్రారంభాన్ని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని.. వాళ్లెవరో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది.

భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల ప్రారంభాన్ని కొందరు ‘ఒలిగార్క్స్‌’(గుత్తాధిపత్య శక్తులు) అడ్డుకుంటున్నారంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థను అన్యాయంగా లేదా వివక్షతో కూడినదిగా పేర్కొనడం “నిరాధారమైన, తప్పుదోవ పట్టించే వాదన” అని పేర్కొంది. 

అందరికీ ఒకే నిబంధనలు
భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు అందించేందుకు గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ (GMPCS) లైసెన్స్‌లను మూడు సంస్థలకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో పాటు భారతి గ్రూప్‌ మద్దతున్న యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ఈ లైసెన్స్‌ పొందాయి. అమెజాన్‌కు చెందిన లియో కూడా భారత మార్కెట్‌లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.

అయితే లైసెన్స్‌ పొందిన ప్రతి సంస్థ కూడా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. వినియోగదారుల భద్రత, వారి డేటా రక్షణ తదితర అంశాలను నిర్ధారించేందుకే ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ మూడు సంస్థలకు సంబంధించి భద్రతా పరిశీలన కొనసాగుతోందని వెల్లడించింది.

ఈ భద్రతా ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత సంస్థలు స్పెక్ట్రమ్‌ కేటాయింపునకు తదుపరి దశకు వెళ్లవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం లైసెన్స్‌ పొందిన మూడు సంస్థలూ దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల స్టార్‌లింక్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అనుమతులు నిలిపివేశారన్న ఆరోపణలకు ఆధారం లేదని తేల్చింది.

మస్క్‌ ట్వీట్‌లో..
అంతకుముందు మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన ఓ పోస్టు ఈ వివాదానికి కారణమైంది. “భారత ప్రజలపై తమ గుత్తాధిపత్య పట్టు కొనసాగించేందుకు కొందరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వాళ్లు ఎవరో మీరు ఊహించవచ్చు” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది భారత ప్రజలపై జరుగుతున్న అన్యాయమని కూడా పేర్కొన్నారు. అయితే మస్క్‌ తన పోస్టులో ఎవరినీ నేరుగా పేరుతో ప్రస్తావించలేదు.

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్‌లింక్‌కు ఇప్పటికే GMPCS లైసెన్స్‌ లభించినప్పటికీ.. వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు ఇంకా భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు సహా కొన్ని తుది అనుమతులు అవసరమవుతున్నాయి.

‘మేము సిద్ధంగా ఉన్నాం’
మస్క్‌ ఆరోపణలకు కొన్ని గంటల ముందే స్టార్‌లింక్‌ ఇండియాలో సేవలు ప్రారంభించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని సంస్థ సీనియర్‌ అధికారి లారెన్‌ డ్రేయర్‌ తెలిపారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2026లో మాట్లాడిన ఆమె.. భారత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు.

భారత వినియోగదారుల డేటా దేశం దాటి బయటకు వెళ్లకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భారత్‌లో ఇప్పటికే అవసరమైన మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టామని.. సుమారు 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సేవలు ప్రారంభించేందుకు తమ కార్యకలాపాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

భారత్‌లోని నియంత్రణ సంస్థలు, టెలికాం కంపెనీలు, పరిశ్రమ వర్గాలతో గత ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని డ్రేయర్‌ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

అసలు సమస్య ఏంటి?
స్టార్‌లింక్‌ ఇప్పటికే భారత ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో కీలక దశలను దాటినా.. తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు వంటి అంశాలపై ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కూడా ఇదే నియంత్రణ వ్యవస్థలో కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ‘స్టార్‌లింక్‌ను మాత్రమే భారత్‌ అడ్డుకుంటోందా?’ అన్న మస్క్‌ ఆరోపణకు.. ‘అందరికీ ఒకే నిబంధనలు’ అంటూ కేంద్రం స్పష్టమైన కౌంటర్‌ ఇచ్చినట్లయింది.

ఇదీ చదవండి: ఎలాన్‌ మస్క్‌కు కేటీఆర్‌ సూటి ప్రశ్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement