ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్పేస్‌ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవ స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొన్ని బడాశక్తులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని, తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్య భారత ప్రజలపై జరుగుతున్న నేరం అంటూ వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
‘ఎలాన్.. ఆ గుత్తాధిపత్య శక్తులు(Oligarchs) ఎవరో పేర్లు బయటపెట్టండి. భారతదేశం తెలుసుకోవాలనుకుంటోంది. మన ప్రభుత్వంపై ఇంతటి పట్టు ఎవరికి ఉంది?’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.
Elon, Name and shame the Oligarchs The Nation (India) wants to know who is got this stranglehold on our Government
— KTR (@KTRBRS) October 7, 2026
మస్క్ ఏమన్నారంటే..
స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు ఇంకా తుది అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఎక్స్ ఖాతాలో భారత్‌కు స్టార్‌లింక్ అవసరమంటూ ఓ పెద్ద ట్వీట్ చేశాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘కొంతమంది గుత్తాధిపత్య శక్తులు భారత ప్రజలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వాళ్లు ఎవరో మీరు ఊహించవచ్చు. ఇది భారత ప్రజలకు జరుగుతున్న నేరం’ అని వ్యాఖ్యానించారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మాత్రం మస్క్ పేర్లు వెల్లడించలేదు.
మస్క్ వ్యాఖ్యలకు కొద్దిగంటల ముందే స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించామని, దేశవ్యాప్తంగా 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెన్నాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
అయితే స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఉన్నప్పటికీ.. వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు స్పెక్ట్రమ్, భద్రతా అనుమతులు సహా మరికొన్ని తుది క్లియరెన్స్‌లు అవసరమవుతున్నాయి.
కేటీఆర్ ప్రశ్నతో ఆసక్తి..
ఇదే సమయంలో మస్క్ ‘గుత్తాధిపత్య శక్తులు’ అంటూ ఎవరినీ పేరు పెట్టకపోవడంతో.. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారు? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. కేటీఆర్ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్లు బయటపెట్టాలని మస్క్‌ను కోరారు.
స్టార్‌లింక్ భారత్‌లోకి రావడం వెనుక ఇప్పటికే టెలికాం సంస్థల మధ్య పోటీ, స్పెక్ట్రమ్ కేటాయింపు, భద్రతా అనుమతులు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన తాజా ఆరోపణలు వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అయితే మస్క్ ఆరోపణల్లో పేర్కొన్న ఆ శక్తులు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఇదీ చదవండి: ఓటు హక్కును హరించే కుట్రే ఇది!


