‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు | Sonia Gandhis Surrender of Values at Centre Over Iran Israel War | Sakshi
Sakshi News home page

‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు

Jun 21 2025 12:48 PM | Updated on Jun 21 2025 1:29 PM

Sonia Gandhis Surrender of Values at Centre Over Iran Israel War

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్ణణల విషయంలో  భారత్‌ మౌనం వహించడం అనేది దౌత్యపరమైన లోపాన్ని ఎత్తిచూపుతున్నదని, ఇది దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నిష్క్రమణను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘ది హిందూ’లో ఆమె జూన్ 13న ఇరాన్ భూభాగంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిని చట్టవిరుద్ధమైనదిగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.

రెండు ప్రాంతీయ శక్తుల మధ్య  జరుగుతున్న ప్రతీకార డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. దీనిపై స్పందించిన భారత జాతీయ కాంగ్రెస్ ఈ బాంబు దాడులను, ఇరాన్ గడ్డపై చోటుచేసుకున్న హత్యలను ఖండించింది. ఇవి ప్రాంతీయంగానూ ప్రపంచస్థాయిలోనూ  పొంచివున్న ముప్పు  తీవ్రతను సూచిస్తాయని పేర్కొంది.  ఇటువంటి చర్యలు అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయని,   మరిన్ని సంఘర్షణకు బీజం వేస్తాయని సోనియా గాంధీ  ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

సోనియా గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ దూకుడుగా వ్యవహరిస్తూ, అందుకు అనుకూలంగా తన సొంత నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ట్రంప్ గతంలో పలు యుద్ధాలు, సైనిక-పారిశ్రామిక సముదాయ శక్తుల గురించి హెచ్చరించారని, అయితే ఇప్పుడు ఇరాక్ యుద్ధానికి దారితీసిన  తప్పులను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోనియా పేర్కొన్నారు.  ఈ వ్యాసంలో సోనియా భారతదేశానికున్న ప్రత్యేకమైన దౌత్య స్థానానికి ప్రాధాన్యతనిచ్చారు.

ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్‌తో సహా కీలక సమయాల్లో  ఇరాన్‌ మద్దతు ఉన్నదన్నారు. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్‌ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తన దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని భారత ప్రభుత్వానికి  సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్దంలో భారత్‌ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు. 

ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్‌ రాదు: ట్రంప్‌ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

Advertisement
 
Advertisement
Advertisement