‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్‌ జంట’ కేసులో మరో ట్విస్ట్‌ | Sonam Claimed She was Drugged Brought to UP | Sakshi
Sakshi News home page

‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్‌ జంట’ కేసులో మరో ట్విస్ట్‌

Jun 10 2025 8:27 AM | Updated on Jun 10 2025 10:20 AM

Sonam Claimed She was Drugged Brought to UP

న్యూఢిల్లీ: మేఘాలయలో ఒక హనీమూన్‌ జంట అదృశ్యం కావడం.. ఆ తరువాత ఈ ఉదంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లు హనీమూన్‌ ట్రిప్‌ కోసం మేఘాలయకు వెళ్లి, కనిపించకుండా పోయారు. కొద్ది రోజులకు రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. ఈ నేపధ్యంలో అతనిని సోనమ్‌ హత్య చేయించిందని ఆరోపిస్తూ ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అదృశ్యంతో మొదలై.. హత్య కేసుగా మారి..
మే 23న అదృశ్యమైన ఈ జంటను గాలించే దిశగా మొదలైన దర్యాప్తు.. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైన దరిమిలా హత్యకేసుగా మారింది. అనంతరం పోలీసులు సోనమ్ కోసం  వెదికారు. వారం తర్వాత సోనమ్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పోలీసుల ఎదుట లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి.  యూపీ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. తనను నిందితురాలిగా చూపించేందుకు పోలీసులు తనకు మత్తుమందు ఇచ్చి ఘాజీపూర్‌కు తీసుకువచ్చాని సోనమ్‌ ఆరోపిస్తున్నదని ఆయన తెలిపారు.

ధాబాలో దాక్కున్న సోనమ్‌
పోలీసులు తన కోసం గాలిస్తారని తెలుసుకున్న సోనమ్‌ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ఒక ధాబాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోనులో చెప్పింది. వెంటనే వారు మధ్యప్రదేశ్ పోలీసులకు విషయం తెలియజేశారు. అక్కడి పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోనమ్ అరెస్టు చేశారు. తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం వన్-స్టాప్ సెంటర్‌కు  తరలించారు. ఇప్పుడు మేఘాలయ పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగంలోకి దిగారు.

ప్రియుడితో కలసి..
మే 23 నుండి రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తు ఆమెను ఘాజీపూర్‌లో పట్టుకోవడంతో మరోమలుపు తిరిగింది. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని మేఘాలయ పోలీసులు భావిస్తున్నారు. ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేసిందని, ఆ తరువాత పోలీసులకు లొంగిపోయిందని అంటున్నారు. ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన అనుమానితురాలు ఘాజీపూర్‌కు ఒంటరిగా వచ్చిందని, ఆమె నుంచి లభ్యమైన ఆధారాలను పరిశీలిస్తున్నామని, నిజం త్వరలో బయటపడుతుందని యూపీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

హతుని సోదరుని అనుమానం ఇదే..
ఈ ఘటనపై రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ రాజ్ కుష్వాహా .. సోనమ్‌కు తోటి ఉద్యోగని, వారు ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటారని సోనమ్‌ కుటుంబం తనకు చెప్పిందన్నారు. తాను రాజ్ కుష్వాహాను ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడే తెలుసుకున్నానని అన్నారు. తన సోదరుని హత్యలో అతని ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా రాజా రఘువంశీ, సోనమ్‌లకు మే 11న వివాహం  జరిగింది. వారు మే 20న తమ హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లారు. ఒక రోజు తర్వాత ఈ జంట అదృశ్యమయ్యింది.

ఇది కూడా చదవండి: ప్రసూతివార్డునూ వదలని రష్యా డ్రోన్లు
 

Advertisement
 
Advertisement
Advertisement