చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు | Slipper Fight on Day One of Aradhana Mishra Mona as UP Congress Chief | Sakshi
Sakshi News home page

చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

Oct 12 2026 11:55 AM | Updated on Oct 12 2026 11:59 AM

Slipper Fight on Day One of Aradhana Mishra Mona as UP Congress Chief

నాయకత్వ మార్పు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. కొత్త పీసీసీ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా మోనా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పార్టీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ మద్దతుదారులు, మోనాకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. బూతులతో రెచ్చిపోతూ కొందరు చెప్పులతో కొట్టుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అజయ్‌ రాయ్‌ స్థానంలో మోనాను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన నేపథ్యంలో ఆదివారం లక్నోలోని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే రాయ్‌ మద్దతుదారులు మోనాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా మోనా మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

నేతల బుజ్జగింపులు
కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకోవడం, బండ బూతులతో దూషించుకోవడం, చెప్పులు విసురుకోవడం వంటి దృశ్యాలు బయటకు వచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. మోనా తండ్రి, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్‌ తివారీతోపాటు యూపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇమ్రాన్‌ మసూద్‌ ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అజయ్‌ రాయ్‌తో ప్రమోద్‌ తివారీ చేతులు జోడించి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి.

ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే ఈ స్థాయిలో గొడవ జరగడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కార్యక్రమానికి హాజరైన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు మమతా చౌధరిపై కూడా కొందరు మాటలతో దాడికి దిగినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొన్నారు.

అజయ్‌ రాయ్‌ ఫిర్యాదు?
తనను ఈ కార్యక్రమం పేరిట అవమానించారంటూ అజయ్‌ రాయ్‌ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఘర్షణ అనంతరం రాయ్‌ తన వారసురాలైన మోనాకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా, అంతర్గత విభేదాలు మాత్రం బయటపడ్డాయి.

ఈ ఘటనపై స్పందించేందుకు రాయ్‌ నిరాకరించారు. పార్టీ కోసం సాధారణ కార్యకర్తగా తన వంతు కృషి కొనసాగిస్తానని, మోనా పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, కొందరు సీనియర్‌ నేతలు ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారు.

మోనా ముందున్న అసలు సవాలు
ఉత్తరప్రదేశ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు మోనా నాయకత్వం కీలకం కానుంది. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. 1989 నుంచి యూపీలో కాంగ్రెస్‌ అధికారానికి దూరంగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ఒకప్పుడు పార్టీకి బలమైన ప్రాంతాలుగా భావించిన అమేథీ, రాయ్‌బరేలీలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తల్లో ఐక్యతను పెంచడం, ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేయడం మోనాకు పెద్ద సవాలుగా మారాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పార్టీ కార్యాలయంలో జరిగిన ఘర్షణ నాయకత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.

కుల సమీకరణాలపైనా చర్చ
యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 2023 ఆగస్టు నుంచి కొనసాగిన అజయ్‌ రాయ్‌ స్థానంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆరాధన మిశ్రా మోనాను నియమించడం రాజకీయ చర్చకు దారితీసింది. రాయ్‌ భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందిన నేత. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు వ్యవహారం సజావుగా సాగేందుకు, రాష్ట్రంలో బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ ఈ మార్పు చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, పార్టీ పగ్గాలు మారిన వెంటనే కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడం కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం మోనాకు తొలి పరీక్షగా మారింది.

ఇదీ చదవండి: బీజేపీ బ్యాక్‌గ్రౌండ్‌.. కాక్రోచ్‌లకు సపోర్ట్‌గా రోడ్డెక్కి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement