కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు? | Secret Affair, 2,004 Phone Calls And A Fatal Push, The Chilling Mystery Behind Pune Businessman Ketan Agarwal’s Death | Sakshi
Sakshi News home page

కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు?

Jun 25 2026 8:48 AM | Updated on Jul 3 2026 2:20 PM

Siya Chetan and the Fatal Push: The Mystery That Remains

పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్‌లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్‌ కాల్స్‌, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్‌ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్‌ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్‌ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్‌ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.

జూన్‌ 18న లోహగడ్‌ కోట వద్ద ప్రీవెడ్డింగ్‌ ఫొటో షూట్‌ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్‌ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్‌ సోదరి సంజనా సియాకు ఫోన్‌ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్‌ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.

విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్‌ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్‌ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్‌ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

జూన్‌ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్‌కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్‌ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్‌ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ కోసం కేతన్‌, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్‌ పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్‌ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్‌ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్‌పోర్ట్‌ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్‌ కౌంటర్‌ వద్ద కేతన్‌, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్‌సెట్‌తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్‌ చౌదరి అని గుర్తించారు.

చేతన్‌ తన మొబైల్‌ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్‌తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్‌ ట్రాకింగ్‌ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్‌ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్‌ మీడియా ఫొటోలు, డిజిటల్‌ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్‌ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్‌ 18 వరకు సియా, చేతన్‌ల మధ్య 2,004 ఫోన్‌ కాల్స్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్‌తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.

పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్‌లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్‌లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్‌తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్‌ విచారణలో చెప్పినట్లు సమాచారం.

కేతన్‌, సియా వివాహం నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్‌ 18న జరిగిన ట్రెక్కింగ్‌ ప్రయాణమే కేతన్‌ జీవితానికి చివరి ప్రయాణమైంది.

పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్‌ ముందుగానే లోహగడ్‌కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్‌లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్‌ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.

ప్రస్తుతం సియా గోయల్‌, చేతన్‌ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్‌ స్నేహితుడు నీరజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ ఆధారాలు, డిజిటల్‌ రికార్డులు, కాల్‌ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.

అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్‌ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్‌కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement