ఆర్టీఐ ముసుగులో వ్యాపారం! | RTI activism has become new business, says Supreme Court | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

Jun 16 2026 4:43 AM | Updated on Jun 16 2026 6:25 AM

RTI activism has become new business, says Supreme Court

ప్రభుత్వ పనుల పర్యవేక్షణకు మీరెవరు? 

సమాచార చట్టం కార్యకర్తల తీరుపై సుప్రీం ఆగ్రహం 

ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు యాక్టివిస్టులు దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్‌లో ప్రభుత్వ రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం కలిగించడంతో పాటు, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. 

పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మీరేమైనా ఉన్నతాధికారా? అని ఈ సందర్భంగా పిటిషనర్‌ను నిలదీసింది. పంజాబ్‌లో రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడమే కాకుండా, పర్యవేక్షిస్తున్న అధికారిని, కార్మికులను బెదిరించి, కులం పేరుతో దూషణలకు దిగారన్న ఆరోపణలపై రమేశ్‌ కుమార్‌ బెహ్ల్‌ అనే ఆర్టీఐ కార్యకర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలివ్వాలంటూ అతడు తొలుత పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. 
ధర్మాసనం పిటిషనర్‌ తీరును తప్పుబట్టింది. ‘ఆర్టీఐ కార్యకర్తలుగా చలామణి అవ్వడం ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంగా మారిపోయింది. కేంద్రం నిధులు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. అసలు మీరెవరు? మీరొక ఆర్టీఐ కార్యకర్తా? ఇదొక ఎల్లో జర్నలిజం‘అని జస్టిస్‌ సందీప్‌ మెహతా వ్యాఖ్యానించారు. అనంతరం జస్టిస్‌ బిష్ణోయ్‌ కలుగజేసుకుంటూ.. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి మీరేమైనా ఉన్నతాధికారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement